NTV Telugu Site icon

Dwayne Bravo Retirement: రిటైర్మెంట్‌ ప్రకటించిన విండీస్‌ దిగ్గజం డ్వేన్‌ బ్రావో!

Dwayne Bravo Cpl

Dwayne Bravo Cpl

Dwayne Bravo CPL Retirement: వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో ప్రొఫెషనల్‌ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2024 తనకు చివరి సీజన్ అని తెలిపాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. బ్రావో ఇప్పటికే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇది ఓ గొప్ప ప్రయాణం అని, సీపీఎల్ 2024 తనకు చివరి సీజన్ అని బ్రావో పేర్కొన్నాడు. ఎక్కడైతే (ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌) మొదలు పెట్టానో.. అక్కడే ముగించాలనుకుంటున్నా అని తెలిపాడు.

సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు డ్వేన్‌ బ్రావో ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సీపీఎల్‌లో అద్భుతమైన కెరీర్‌ను కలిగి ఉన్నాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. తన సారథ్యంలో మూడు జట్లను ఛాంపియన్‌గా నిలిపాడు. మొత్తంగా బ్రావో ఐదు సీపీఎల్‌ టైటిళ్లను గెలిచాడు. 103 సీపీఎల్‌ మ్యాచ్‌లలో 1155 పరుగులు చేశాడు. అంతేకాదు 128 వికెట్లు తీశాడు. మరోవైపు 161 ఐపీఎల్ మ్యాచ్‌లలో 1560 రన్స్, 183 వికెట్స్ పడగొట్టాడు.

2006 నుంచి ప్రొఫెషనల్‌ టీ20లు ఆడుతున్న డ్వేన్‌ బ్రావో.. మొత్తం 579 మ్యాచ్‌లు ఆడి 630 వికెట్లు పడగొట్టాడు. పొట్టి క్రికెట్‌ చరిత్రలో బ్రావోతో పాటు రషీద్‌ ఖాన్‌ మాత్రమే 600 వికెట్ల మైలురాయిని దాటాడు. ఇక వెస్టిండీస్‌ తరఫున 40 టెస్ట్‌లు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. 6500 పరుగులు చేసి.. 363 వికెట్లు తీశాడు. ఇప్పటికే చెన్నైలో కోచ్‌గా ఉన్న బ్రావో.. మరిన్ని జట్లకు సేవలందించే అవకాశం ఉంది.

Show comments