పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (28) హత్య కేసు దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ ఆఫీసర్ పాటిల్ దేవరాజ్ మునీష్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పాటిల్ దేవరాజ్ మునీష్‌కు కేసు దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు. కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
దర్యాప్తులో భాగంగా ఐపీఎస్ ఆఫీసర్ పాటిల్ దేవరాజ్ మునీష్‌కు రాజమహేంద్రవరం సౌత్ జోన్ డీఎస్పీ శివప్రియ, ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్ సీఐ బాజీలాల్ సహకారం అందించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. డాక్టర్ ప్రియాంక హత్య కేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. దర్యాప్తు ఏ దిశగా సాగుతుంది?, నిందితులపై ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో ప్రియాంక పీజీ ఫస్టియర్ చదువుతున్నారు. ఆగస్టు 3న రాత్రి రాజమహేంద్రవరం ప్రసాద్ ఆదిత్య మాల్‌లో సినిమా చూసి.. సహచర విద్యార్థితో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వాహనాలు థియేటర్ గేటు వద్ద ఆగగా.. నామవరానికి చెందిన సురవరపు దశ్వంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ మద్యం మత్తులో కారు వేగంగా నడుపుతూ వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టారు. మరోసారి ఢీకొట్టగా.. పైనుంచి కారు వెళ్లడంతో ప్రియాంక తలకు తీవ్ర గాయమైంది. ఆగస్టు 6న సికింద్రాబాద్‌లోని ప్రియాంకను కిమ్స్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆగస్టు 10న మృతి చెందారు.

