Donga Naa Koduku Teaser Out: యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌళి.. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి భారీ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి విభిన్నమైన కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. మౌళి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్ ను గమనిస్తే.. సినిమా క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తోంది. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో మౌళి ఈశ్వర్ అనే యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. పెద్దగా పనిపాట లేకుండా సరదాగా తిరిగే ఈశ్వర్‌కు ఇంట్లో కూడా పెద్దగా విలువ ఉండదు. ఈశ్వర్ జీవితంలోకి ఓ గర్ల్‌ఫ్రెండ్ రావడంతో కథ మరింత ఆసక్తికరంగా మారినట్లు టీజర్‌లో చూపించారు. అయితే అతడి జీవితంలోకి డబ్బు వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఆ డబ్బు ఎలా వచ్చింది? దాని వల్ల ఈశ్వర్ ఎదుర్కొన్న సమస్యలేంటి? చివరకు అతడి కథ ఎలాంటి మలుపు తిరిగింది? అనేదే సినిమాలో కీలకంగా కనిపిస్తోంది.
టీజర్‌లో మౌళి తనదైన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా టీజర్‌లోని ఫన్నీ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. టైటిల్‌కు తగ్గట్టుగానే క్రైమ్, కామెడీ అంశాలను కలిపి ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మౌళికి జోడీగా సుస్మితా శెట్టి నటిస్తోంది. అలీ, రఘుబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘దొంగ నా కొడుకు’ చిత్రం వచ్చే నెల 13న థియేటర్లలో విడుదల కానుంది. మౌళి మరోసారి తన కామెడీతో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

