5 Months Old Boy Dies in Street Dogs Attack in Shaikpet: వీధి కుక్కలు మరో చిన్నారి ప్రాణాలను బలి తీసుకున్నాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు, ఖమ్మంలోని రఘునాథపాలెం మండలంలో 5 ఏళ్ల చిన్నారి కుక్కల దాడిలో మృతి చెందిన ఘటనలు ఇంకా మన కళ్ల ముందు మెదలాడుతుండగానే.. తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో వీధి కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి.. 17 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
వివరాల ప్రకారం… అంజి, అనూష దంపతులు షేక్‌పేట వినోబానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 8న తమ 5 నెలల కుమారుడు శరత్‌ను గుడిసెలో పడుకోబెట్టి.. అంజి, అనూషలు పనుల కోసం బయటికి వెళ్లారు. కాసేపటికి వచ్చి చూసేసరికి చిన్నారి తీవ్రంగా గాయపడి.. ఏడుస్తూ కనిపించాడు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు నిలోఫర్‌కు పంపారు. నిలోఫర్ సిబ్బంది సూచనలతో చిన్నారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు.
Also Read: Covid 19: భూపాలపల్లిలో కరోనా కలకలం.. ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్!
ఉస్మానియా వైద్యులు చిన్నారి శరత్‌కు శస్త్రచికిత్స చేసి.. ఎన్‌ఎస్ ఐసీయూలో ఉంచారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి 17 రోజుల పాటు మృత్యువుతో పోరాడి.. చివరకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కుమారుడి మరణంతో అంజి, అనూష దంపతులు కన్నీరుమున్నీరు అయ్యారు. మూడు వీధి కుక్కలు గుడిసెలోకి చొరబడి చిన్నారిపై దాడి చేసినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఈ ఘటనపై స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు. వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేస్తున్నా.. ఏ మాత్రం పట్టనట్లే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.