Karnataka Assembly Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమయం సమీపిస్తుండడంతో ప్రచారం ఊపందుకుంది. ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీ, జేడీఎస్‌లు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా.. మరో వైపు బెట్టింగ్ రాయుళ్లు ఎవరు గెలుస్తారు.. ? ఎవరికి ఎంత మెజార్టీ వస్తుందని అంచనాలు బెట్టింగ్ వేస్తున్నట్లు సమాచారం. ఈ బెట్టింగ్ ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా జ్యోతిష్యాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఫలనా అభ్యర్థి గ్రహ బలం చాలా బాగుందని.. కచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధిస్తారని కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నారు. కొన్ని పార్టీల నాయకులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పని నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో గెలిపిస్తే అన్ని వసతులు కల్పిస్తామంటూ నేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు.
Read Also: Karnataka Elections: కర్ణాటకలో వేడెక్కిన రాజకీయం.. ప్రధాని మోడీ ఎన్నికల శంఖారావం
ఇదిలా ఉండగా కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. దీనిపై కొంతమంది జ్యోతిష్యులను కూడా ఆశ్రయిస్తున్నారు.ఈ నేపథ్యంలో మండ్యాలోని అశోక్‌నగర్‌లో కాలభైరవ తదుపరి ముఖ్యమంత్రి ఎవరని అంచనా వేసింది. ఇక్కడ శునకాన్ని కాలభైరవుడిగా పూజిస్తారు. పూజలు నిర్వహించిన అనంతరం కాలభైరవుడి ముందు బసవరాజ్ బొమ్మై, హెచ్‌డీ కుమారస్వామి, డీకే శివకుమార్‌లు ఫొటోలను ఉంచారు. ఆ మూడు ఫొటోలలో కాబోయే ముఖ్యమంత్రిని ఎంచుకోవాలని శునకాన్ని అడిగారు. ఆ శునకం నేరుగా వెళ్లి హెచ్‌డీ కుమారస్వామి ఫొటోను ఎంచుకుంది. కాలభైరవ చెప్పిన చాలా విషయాలు నిజాలు అయ్యాయని కుక్కు యజమాని గోపి వెల్లడించారు. గతంలో కూడా ఇలానే అంచనా వేసిన విషయాలు చాలా వరకు జరిగాయన్నారు. మరి ఈ జరుగుతుందో.. కాలభైరవ జోస్యం నిజమవుతుందో లేదో అంటే ఎన్నికలు ముగిసేంతవరకు వేచి చూడాల్సిందే. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మే 10న పోలింగ్ జరగనుండగా.. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించి.. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు దక్షిణ భారతంలో బలమైన సంకేతాలు పంపించాలని చూస్తోంది.