BCCI Prize Money For 2007 T20 World Cup and 2011 ODI World Cup: టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల నజరానా అందించిన విషయం తెలిసిందే. 15 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రూ.5 కోట్లు, కోచ్‌లకు తలో రూ.2.5 కోట్లు, రిజర్వ్ ఆటగాళ్లకు మరియు సెలక్టర్లకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున ప్రైజ్ మనీ దక్కింది. అయితే 1983, 2007, 2011, 2013లలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత ఆటగాళ్లకు ఎంత దక్కిందని ఫాన్స్ గూగుల్‌లో వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ వివరాలను ఓసారి చూద్దాం.
2013 Champions Trophy BCCI Prize Money:
టీ20 ప్రపంచకప్ 2024 ముందు ఎంఎస్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. భారత జట్టులోని ఆటగాళ్లకు బీసీసీఐ రూ.కోటి చొప్పున నజరానా అందించింది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మలు అప్పటి జట్టులో ఉన్నారు.
2011 ODI World Cup BCCI Prize Money:
ఎంఎస్ ధోనీ సారథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్లు దక్కింది. కోచ్, సపోర్టింగ్ స్టాఫ్‌కు ఒక్కొక్కరికి రూ.50 లక్షలు.. సెలెక్టర్లకు రూ.25 లక్షల చొప్పున బీసీసీఐ పారితోషికం అందించింది. అప్పుడు భారత జట్టులో దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంబీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ ఉన్నారు.
2007 T20 World Cup BCCI Prize Money:
2007లో ఎంఎస్ ధోనీ నేతృత్వంలో టీ20 ప్రపంచకప్‌ను సాధించిన భారత జట్టుకు బీసీసీఐ రూ.12 కోట్ల రివార్డును ప్రకటించింది. జట్టులో ఎక్కువ మంది కుర్రాళ్లే ఉన్నారు. రోహిత్ శర్మ, గౌతమ్ గంబీర్, యువరాజ్ సింగ్, శ్రీశాంత్, జోగిందర్ శర్మ, ఆర్పీ సింగ్, ఎంఎస్ ధోనీలు ఉన్నారు.
Also Read: Gold Price in Hyderabad: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన బంగారం ధరలు!
1983 ODI World Cup BCCI Prize Money:
కపిల్ దేవ్ నాయకత్వంలో 1983 వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలిచిన విషయం తెలిసిందే. భారత్‌ను ఇదే మొదటి ప్రపంచకప్. అప్పటి ఆటగాళ్లకు బీసీసీఐ ఎంత నగదు బహుమతిని అందించిందనే దానిపై స్పష్టత లేదు. అప్పట్లో ఆటగాళ్లకు పారితోషికం ఇవ్వడానికి బీసీసీఐ వద్ద పెద్దగా డబ్బు లేదట. నివేదికల ప్రకారం.. 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ప్రతి ఆటగాడికి బీసీసీఐ రూ. 25,000 నగదు బహుమతిని అందజేసిందట. నిధుల సేకరణ కోసం దివంగత లతా మంగేష్కర్ సంగీత కచేరీని నిర్వహించారట. ఆ తర్వాత ఆటగాళ్లకు నజరానా రూ.1 లక్షకు పెరిందట.