NTV Telugu Site icon

Farmers protest: మెట్రో అధికారుల అలర్ట్.. 8 మెట్రో స్టేషన్ల గేట్లు క్లోజ్

Delhi Metro

Delhi Metro

తమ డిమాండ్ల పరిష్కారం కోసం అన్నదాతలు దేశ రాజధాని ఢిల్లీకి (Delhi) కదం తొక్కారు. పెద్ద ఎత్తున కర్షకులు (Farmers protest హస్తినకు తరలివచ్చారు. ట్రాక్టర్లతో ర్యాలీగా బయల్దేరి వచ్చారు. మరోవైపు రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా సరిహద్దులో భారీ ఎత్తున భద్రతా బలగాలు మోహరించారు. రోడ్డుకి మధ్యలో బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు, ఇనుప కంచెలు వేశారు. ఇంకోవైపు బలగాలను ఛేదించుకుంటూ నిరసనకారులు ఢిల్లీలోకి ప్రవేశిస్తు్న్నారు. దీంతో పోలీసులకు-రైతుల మధ్య తీవ్ర ఘర్షణతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. అన్నదాతలను అదుపు చేసేందుకు వారి టియర్ గ్యాస్, జల ఫిరంగులు ప్రయోగించారు.

ఇదిలా ఉంటే రైతుల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో (Delhi Metro) అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాన ప్రాంతాల్లో ఎనిమిది మెట్రో స్టేషన్లలో మెయిన్ గేట్లు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు DMRC ట్విట్టర్ ద్వారా తెలిపింది.

సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్, ఉద్యోగ్ భవన్, పటేల్ చౌక్, మండి హౌస్, బరాఖంబా రోడ్, జనపథ్, ఖాన్ మార్కెట్ మరియు లోక్ కళ్యాణ్ మార్గ్ వంటి అనేక స్టేషన్లలో అనేక గేట్లను మూసివేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఇదిలా ఉంటే అన్నదాతలు ముందస్తు పక్కా ప్రణాళికతో రాజధానికి తరలివస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలలకు సరిపడా సామాగ్రితో రైతులు బయల్దేరి వస్తున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి సమాచారం చేరవేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకూ తిరిగి వెళ్లేదిలేదంటూ కర్షకులు చెబుతున్నారు.