AP Heavy Rains Flood Alerts: దిత్వా తుఫాను ప్రభావం నెల్లూరు, బాపట్ల జిల్లాలను తీవ్రమైన వర్ష విపత్తులోకి నెట్టేసింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానతో రెండు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంగళవారం రాత్రి మరోసారి భారీ వర్షాలు కరిశాయి. దీంతో నగరాలు, శివార్లు, గ్రామాలు అన్నీ నీటితో నిండిపోయి ప్రజలకు రాత్రంతా నిద్రలేని పరిస్థితి ఏర్పడింది. నెల్లూరులో రాత్రి కురిసిన భారీ వాన నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా మాగుంట లేఅవుట్‌లోని రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తిగా నీటమునిగిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఐదు అడుగుల వరకు నీరు నిలిచిపోవడంతో ప్రయాణాలు అర్ధరాత్రి నుంచే నిలిచిపోయాయి. మరోవైపు అనేక లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బందుల్లో మునిగిపోయారు. నగరంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ప్రతి వర్షానికి సమస్యలు పెరగడానికి కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Dharma Productions: యువ హీరోని విడిచిపెట్టని బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌజ్.. వరుసగా సినిమా ఛాన్స్‌లు!
జాతీయ రహదారిపై కూడా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించి, వాహనాలు వెంకటాచలం వరకూ నీరు భారీగా నిలిచిపోయింది. పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్‌ను సర్దుబాటు చేయడానికి ప్రయత్నించినా వర్షం దెబ్బకు పరిస్థితి అదుపులోకి రావడం ఆలస్యమైంది. జిల్లాలో మొత్తం పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా తీర ప్రాంతాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. దిత్వా అవశేషాలు వాయుగుండంగా మారి ఇంకా బలహీనపడుతున్నప్పటికీ దాని తేమ ప్రభావం మాత్రం తీరప్రాంత జిల్లాలను వదలడం లేదు. ఈ వాతావరణ మార్పుల దెబ్బకు బాపట్ల జిల్లా రైతులపై మరింత తీవ్ర ప్రభావం పడింది. కొల్లూరు, వేమూరు మండలాల్లో కురిసిన భారీ వర్షాలు వరి పంటను పూర్తిగా నాశనం చేశాయి. కోత దశలో ఉన్న ధాన్యం రోడ్ల పక్కన ఆరబెట్టగా ఆ వర్ష జల్లులో పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం మొలకెత్తే ప్రమాదంతో రైతులు భయాందోళనకు గురయ్యారు.
