Dhurandhar: రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ విడుదలై దాదాపు ఆరు వారాలు గడిచినా బాక్సాఫీస్ వద్ద దూకుడు ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.1300 కోట్ల మార్క్‌కు చేరువలో ఉన్న ఈ సినిమా మరో చరిత్రాత్మక రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్’ ఇప్పుడు ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. తొమ్మిదేళ్లుగా ఎవ్వరూ తాకలేని ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలోని ‘బాహుబలి 2’ రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది. ‘బాహుబలి 2’ 2017లో అమెరికా–కెనడాల్లో $20.7 మిలియన్లు వసూలు చేయగా, ‘ధురంధర్’ తాజాగా $21 మిలియన్ గ్రాస్ కలెక్షన్లతో ఆ రికార్డును దాటేసింది.
READ MORE: Kishan Reddy: జర్నలిస్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనైతికం..
భారత్‌లోనూ ఈ సినిమా ప్రభంజనం కొనసాగుతోంది. దేశీయంగా ఇది ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా నెట్, దాదాపు రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, ఇప్పటివరకు విడుదలైన హిందీ సినిమాల్లో అగ్రస్థానంలో నిలిచింది. మిడిల్ ఈస్ట్‌లో విడుదల లేకపోయినా లేదా పరిమితంగా మాత్రమే విడుదలైనా, ఓవర్సీస్‌లో మొత్తం కలెక్షన్లు $32 మిలియన్ వరకు చేరడం విశేషం. ఇందులో ప్రధాన పాత్ర పోషించింది ఉత్తర అమెరికా మార్కెట్‌నే. అమెరికాలో తన ప్రయాణంలో ‘ధురంధర్’ ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల వసూళ్లను వెనక్కి నెట్టింది. కల్కి 2898 ఏడీ, పఠాన్, జవాన్, ఆర్ఆర్ఆర్, పుష్ప 2, యానిమల్, దంగల్ వంటి భారీ హిట్ సినిమాల కంటే ఎక్కువగా అక్కడ వసూలు చేసింది. ఆస్ట్రేలియాలోనూ ఇదే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఓవర్సీస్ వసూళ్ల పరంగా అన్ని కాలాల టాప్ ఇండియన్ సినిమాల జాబితాలో 13వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు.. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. జనవరి 30న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘ధురంధర్’ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు వెలువడ లేదు.
READ MORE: NTV Journalists Arrest: ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను తీవ్రంగా ఖండించిన ఏపీయూడబ్ల్యూజే..
