Dhanush OM Movie Title Changed: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘ఓం’ (OM) విడుదల ముంగిట ఊహించని మార్పుకు లోనైంది. రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈ నెల 20న థియేటర్లలోకి రానుంది. అయితే, సినిమా టైటిల్‌పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మొదట ఈ చిత్రాన్ని ‘ఓం: చాప్టర్ 1 – ఉదయరామ్ ద బ్లడ్ వుడ్’ అనే టైటిల్‌తో ప్రచారం చేశారు. అయితే, ‘ఓం’ అనే పదం మతపరమైన మనోభావాలకు సంబంధించినది కావడంతో సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలిపింది. దీంతో చిత్రబృందం టైటిల్‌ను స్వల్పంగా మార్చింది. తాజా సెన్సార్ పోస్టర్ మరియు ట్రైలర్లో ‘ఓ’ (O), ‘ఎం’ (M) అక్షరాల మధ్య చుక్క (డాట్) పెట్టి ‘O.M’ (ఆపరేషన్ మోల్) అనే ఉపశీర్షికను జోడించారు. ఈ మార్పులతో సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికెట్‌ను అందుకుంది.
ఈ సినిమాలో ఇద్దరు క్రేజీ హీరోయిన్లు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటివరకు తన ప్రతి సినిమాలో ఎంతో సింపుల్‌గా, సాఫ్ట్ పాత్రల్లో కనిపించిన సాయి పల్లవి.. ఇందులో రూట్ మార్చి యాక్షన్ హీరోయిన్గా మారింది. ‘నిత్యా రెడ్డి’ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనుంది. మరోవైపు కేవలం గ్లామర్ పాత్రలు, పాటలకే పరిమితమవుతుందన్న ముద్ర ఉన్న శ్రీలీల.. ఇందులో ధనుష్ భార్యగా ఒక మధ్యతరగతి గృహిణి పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరచనుంది. ఈ సినిమా విజయం అటు ధనుష్‌కు, ఇటు శ్రీలీలకు అత్యంత కీలకంగా మారింది. ధనుష్ సరైన హిట్ కొట్టి చాలా కాలమైంది. గతంలో వచ్చిన ‘కల’ (రాయన్), ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘ఇడ్లీ కడాయి’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేర’ తెలుగులో విజయం సాధించినా.. తమిళంలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ధనుష్ ఈ నెల 20న రాబోతున్న ‘O.M’ చిత్రంపైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు.

