NTV Telugu Site icon

Rajya Sabha: డెరెక్‌ ఓబ్రెయిన్ సస్పెన్షన్‌పై రాజ్యసభలో హైడ్రామా.. చివరకు..

Rajya Sabha

Rajya Sabha

Rajya Sabha: తృణమూల్‌ కాంగ్రెస్ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్ సస్పెన్షన్‌పై రాజ్యసభలో హైడ్రామా కొనసాగింది. మొదట రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌ను రాజ్యసభ చైర్మెన్ సస్పెండ్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. అయితే ఆ తర్వాత మాటమార్చుకున్న రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్ ధన్‌ఖర్ సస్పన్షన్ ఓటింగ్ చేపట్టేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో డెరెక్ ఓబ్రెయిన్ తిరిగి సభకు హాజరయ్యేందుకు అనుమతి లభించింది. రాజ్యసభలో ఇవాళ గందరగోళ వాతావరణం నెలకొంది. మణిపూర్ అంశంపై విపక్షాలు తమ నిరసనను కొనసాగించారు.

Also Read: CCTV Camera: టమాటా పొలంలో సీసీటీవీ కెమెరాలు.. చోరీ జరగకుండా రైతు వినూత్న ఐడియా

ఢిల్లీ సర్వీసుల బిల్లుపై సోమవారం జరిగిన చర్చ సందర్భంగా ఓబ్రెయిన్‌ తీరుపై రాజ్యసభ ఛైర్మన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పీయూష్ గోయల్‌ను టీఎంసీ ఎంపీకి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఛైర్మన్ కోరారు. ఈ క్రమంలోనే సస్పెండ్ చేయాలని కోరుతూ రాజ్యసభాపక్ష నేత పీయూష్‌ గోయల్ మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టారు. సభా కార్యకలాపాలకు నిరంతరాయంగా అంతరాయం కలిగించినందుకు, సభాపతికి అవిధేయత చూపినందుకు ఓబ్రెయిన్‌ను సెషన్‌లో సస్పెండ్ చేయాలని కోరుతున్నట్లు గోయల్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఓబ్రెయిన్‌ను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. ఓబ్రెయిన్‌ను తక్షణమే సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళన చేయడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.

Also Read: Rahul Gandhi: రాహుల్‌కు అధికార నివాసంగా ఆ బంగ్లానే కేటాయింపు !

ఎగువ సభ మళ్లీ ప్రారంభమైన అనంతరం ఓబ్రెయిన్‌ ప్రవర్తనను ఆమోదించాలా వద్దా అనే దానిపై సభ్యుల అభిప్రాయాలను కోరాడు. సస్పెన్షన్‌ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు రాజ్యసభ ఛైర్మన్‌ నిరాకరించారు. దీంతో డెరెక్ ఓబ్రెయిన్ తిరిగి సభకు హాజరయ్యేందుకు అనుమతి లభించింది. ప్రమోద్ తివారీ (కాంగ్రెస్)తో సహా పలువురు సభ్యులు ఓబ్రెయిన్‌పై సానుభూతి చూపాలని ఛైర్మన్‌ను కోరారు, అయితే ఛైర్మన్ ఎందుకు మెతక వైఖరిని ప్రదర్శించాలని ప్రశ్నించారు. అలాగే ఆయన మాట్లాడుతూ. ‘‘ఇప్పుడు ఓబ్రెయిన్‌ను సభ నుంచి సస్పెండ్ చేస్తే.. ఆయన మళ్లీ సభకు హాజరుకాగలరా? ఈ తీర్మానం ఆమోదం పొందితే ఆయన సభకు రాలేరు. దీని వల్ల ఎలాంటి ఫలితం లేదు. అందువల్ల దూరదృష్టితో ఆలోచించి ఓటింగ్‌కు అనుమతించడం లేదు. ఈ సభలో సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి బాధపడాల్సింది నేనే. ఆ బాధను నేను భరించలేను’’ అని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్‌ ధన్‌ఖర్‌ అన్నారు.