Site icon NTV Telugu

Mallu Bhatti Vikramarka: మహిళా అభివృద్ధే లక్ష్యం.. స్త్రీ సమ్మిట్ 2.0లో డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో జరిగిన స్త్రీ సమ్మిట్ 2.0 – 2025 కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళల హక్కులు, భద్రత, అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేసారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన మాట్లాడారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మార్చి 8 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం), ఏప్రిల్ 14 (డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి) తేదీలను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. అంబేద్కర్ మహిళలకు అనేక హక్కులు కల్పించారని, మహిళలను శక్తిగా, దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మన దేశానికి ఉందని తెలిపారు.

మహిళల హక్కుల కోసం పార్లమెంట్‌లో అనేక బిల్లులు రూపొందించబడ్డాయని, ఈ దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఎదగాలని ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి రూ. 21,000 కోట్లు విలువైన వడ్డీ లేని రుణాలు మహిళలకు అందుతుండటం విశేషమని చెప్పారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యమని అని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. గ్రీన్ ఎనర్జీ రంగంలో తెరంగాణ మహిళలను భాగస్వామ్యం చేస్తున్నామని, 1000 మెగావాట్ల పునరుత్పత్తి విద్యుత్ ఉత్పత్తికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తో కలిసి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరా శక్తి క్యాంటీన్స్, ఆర్టీసీతో కలిసి మహిళలు భాగస్వామ్యం అవడం, స్థానిక సంస్థలలో 33% రిజర్వేషన్లు వంటి పలు చర్యల ద్వారా మహిళలు తమ పాదాలపై నిలబడేందుకు అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ఈ సందర్బంగా ఆయన “మా సీఎం గారి మాటను తెలియజేస్తున్నానని.. తెలంగాణ ప్రభుత్వం మహిళలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉంది” అని తెలిపారు.

Exit mobile version