దేశంలోనే కీలకమైన ఢిల్లీ విశ్వవిద్యాలయానికి స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇపుడు అన్ని విద్యాసంస్థల్లో, రాజకీయ పార్టీల్లో డియూ స్టూడెంట్ యూనియన్ ఎన్నికలపై ఆసక్తికర చర్చ ప్రారంభమైంది.ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విద్యార్థుల్లో నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించేందుకు. విద్యార్థి సంఘం లేదా స్టూడెంట్ కౌన్సిల్ పేరుతో విద్యార్థుల ఎన్నికల ప్రక్రియను ప్రోత్సహిస్తున్నాయి. భారత దేశంలోనూ జాతీయ విశ్వవిద్యాలయాలు, కొన్ని రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు విద్యార్థి సంఘ ఎన్నికలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నాయి. 1922లో కేవలం 750 మంది విద్యార్థులు, ఇద్దరు ఫ్యాకల్టీతో ప్రారంభమైన ఢిల్లీ యూనివర్సిటీ నేడు ప్రపంచ స్థాయి విద్యాసంస్థగా ఎదిగింది. గత వందేళ్లలో డియూ విద్య, పరిశోధనలకు మాత్రమే కాకుండా, సామాజిక–రాజకీయ ఉద్యమాలకు కూడా కేంద్రంగా నిలిచింది.
Also Read:Off The Record: ఆయన మాత్రం బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోతున్నారు ఎందుకు..?
ఢిల్లీ చదివిన విద్యార్థులు తర్వాత కాలంలో రాజకీయాలు, న్యాయవ్యవస్థ, మీడియా, ఫ్యాషన్, స్పోర్ట్స్, కార్పొరేట్ రంగం వంటి అనేక విభాగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ఈ యూనివర్సిటీ నుండి పుట్టిన ఆలోచనలు, ఆందోళనలు, నాయకత్వ లక్షణాలు దేశ దిశను ప్రభావితం చేశాయి. మన దేశంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం, జేఎన్‌యూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో జరిగే విద్యార్థి సంఘ ఎన్నికలు కేవలం వార్తల్లో నిలిచిపోవడం మాత్రమే కాదు, ప్రత్యేక ఆసక్తికి తావిస్తాయి. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షాలను పెంపొందించేందుకు ఈ ఎన్నికలు స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు కీలకంగా మారుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలెక్టేడ్ స్టూడెంట్ బాడీ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని 52 కళాశాలలు,మరి కొన్ని డిపార్ట్మెంట్ లతో కలిపి మొత్తం లక్షా 60 వేల మంది విద్యార్థులు ఓటర్లుగా వ్యవహరిస్తారు.
ప్రతి ఏటా ఢిల్లీ యూనివర్సిటీలో జరిగే స్టూడెంట్ యూనియన్ ఎన్నికల పండుగ మొదలైంది. సెప్టెంబర్ 18 న ఎన్నికలు జరగనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే విద్యార్థి సంఘం ఎన్నికలు రాజకీయాలను ప్రత్యక్షంగా ,పరోక్షంగా ప్రభావితం చేస్తాయడంలో ఎలాంటి సందేహం లేదు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాల వారిగా మరియు ఢిల్లీ యూనివర్సిటీ మెయిన్ ప్యానెల్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్,సెక్రటరీ, మరియు జాయింట్ సెక్రటరీ పోస్టులను కైవసం చేసుకోవడం కోసం వివిధ విద్యార్థి సంఘాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. రాజకీయంగా అత్యంత చైతన్యంగా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ఈ యూనియన్ ఎన్నికలలో ఎటువంటి ఫలితాలు డైసైడ్ చేస్తారనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి కనబడుతోంది.
గత 4 సంవత్సరాలుగా CUET ప్రవేశ పరీక్షలతో, ఢిల్లీ విశ్వవిద్యాలయం ఇప్పుడు దేశం నలుమూలల మారుమూల పల్లెల నుండి వచ్చిన విద్యార్థులకు ప్రాతినిధ్యం వహిస్తూ మినీ భారత్ ను తలపిస్తుంది. కుల, ప్రాంతీయ, రాజకీయాల ప్రభావంలో ఉన్న ఈ ఎన్నికలు, ఇప్పుడు జాతీయ అంశాలు, జాతీయవాదం వంటి అంశాలను ప్రతిబింబిస్తున్నాయి. విద్యారంగ సమస్యలు మాత్రమే కాకుండా ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో దేశ రాజకీయలలో సమకాలీన పరిస్థితులను విద్యార్థుల మనోగతాన్ని తెలియజేస్తున్నాయి.
యూనివర్సిటీల్లో ఎన్నికలు కేవలం విద్యార్థి సంఘాల మనుగడ గురించే మాత్రమే కావని చెప్పవచ్చు. ఈ ఎన్నికలు దేశానికి బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని అందించనున్నాయి. పార్లమెంట్ లో ఎంపీలు , అసెంభ్లీలో ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల్లో కీలక పదవుల్లో ఉన్న వాళ్లెందరో తమ రాజకీయ పాఠాలను విద్యార్థి సంఘాల నుంచి నేర్చుకున్న వాళ్ళే.. ఢిల్లీ యూనివర్సిటీకి ఎన్నికలు జరుగుతున్న వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి పొజీషన్ లో ఉన్న రేఖా గుప్త ఒకనాడు ఢిల్లీలో స్టూడెంట్ లీడరే. దేశ రాజకీయాలలో కీలకంగా వ్యవహారించిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఉపరాష్ట్రపతి దాకా ఎదిగిన వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, అరుణ్ జైట్లీ, మొదలైన వాళ్లందరూ విద్యార్థి సంఘాలలో రాటుదేలి వచ్చినవారే.
రాజకీయాలలోకి రాకపోయినా వివిధ రంగాల్లో నాయకత్వ ప్రతిభను చూపి ఉన్నతస్థానాల్లో సేవలందిస్తున్న వారు వేలల్లో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రభావితం చేస్తున్న ప్రస్తుత తరుణంలో, యువతలో ఉత్తేజాన్ని సామాజిక స్పృహను పెంచేందుకు ఎన్నికలు దోహదపడనున్నాయి. తరగతి గదులే కాదు సామాజిక అంశాలపై చర్చ జరిగేందుకు, మానసిక ఉల్లాస కోసం తప్పుడు వ్యసనాలు బారిన పడకుండా, మానసిక రుగ్మతలతో నిర్వీర్యం కాకుండా స్టూడెంట్స్ లో చైతన్యం తీసుకువచ్చేందుకు విద్యార్థి సంఘాల ఎన్నికల అవసరం ఎంతో ఉందని విశ్లేషకులు సైతం స్పష్టం చేస్తున్నారు.
Also Read:Hamas Leadership: అజ్ఞాతంలోకి హమాస్ అగ్రనాయకత్వం.. ఆ ముగ్గురు ఎక్కడ?..
అందుకే ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలు కేవలం క్యాంపస్‌లో జరిగే ఓటింగ్ మాత్రమే కాదు, దేశ రాజకీయాల దిశను సూచించే బారోమీటర్గా భావించబడుతున్నాయి. ఢియూ ఎన్నికల్లో గతంలో ఎబివిపి (ABVP), ఎన్ఎస్‌యూఐ (NSUI) వంటి జాతీయ విద్యార్థి సంఘాలు ప్రధాన ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. జేఎన్ యూ లో ప్రభావం చూపే లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ సంఘాల ఎంట్రీతో ఉత్కంఠభరితంగా మారింది.
