CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది

Cjp

Cjp

CJP Protest: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ఢిల్లీ వేదికగా తీవ్ర కలకలం రేగింది. కాకరోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘సంసద్ చలో’ నిరసన ప్రదర్శన తీవ్ర హింసాత్మకంగా మారింది. జంతర్ మంతర్, జన్ పథ్, రైసీనా రోడ్ వంటి కీలక ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి. రోడ్లపై నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ పోలీసుల వివరాల ప్రకారం.. సీజేపీ శ్రేణులు శాంతిభద్రతల నిబంధనలను, సెక్షన్ 163 ఆదేశాలను ఉల్లంఘించి ఉగ్రరూపం దాల్చారు. భద్రతా బలగాలపైకి ముందస్తు ప్రణాళిక ప్రకారమే రాళ్ల దాడికి పాల్పడ్డారని, పక్కా స్కెచ్‌తోనే ఈ హింసకు ఒడిగట్టినట్లు కనిపిస్తోందని విధుల్లో ఉన్న అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 5 మంది ఐపీఎస్ (IPS) ఉన్నతాధికారులతో సహా మొత్తం 118 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. వీరిలో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. నిరసనకారుల్లో కూడా 60 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. అంతేకాకుండా, 15 నుంచి 20 ప్రభుత్వ వాహనాలను ప్రదర్శనకారులు ధ్వంసం చేశారు. జన్ పథ్ ప్రాంతంలోని పలు దుకాణాలపై కూడా దాడులు జరిగాయి. ఇదిలా ఉండగా.. నిరసన కారులు సైతం పెద్ద ఎత్తున గాయపడ్డారు. ఇందులకు సంబంధించిన అధికారిక సమాచారం అందలేదు.

70 మంది అదుపులోకి.. అభిజీత్ దీప్కే నిరాహార దీక్ష విరమణ:

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించి దాదాపు 70 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో చాలామంది విద్యార్థులు కారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందనే కోణంలో ‘భారతీయ నస్య సంహిత’ (BNS) చట్టాల కింద కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన రెండున్నర రోజుల నిరాహార దీక్షను సోమవారం విరమించారు. జులై 18న సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించినప్పటి నుంచి ఆయన నిరాహార దీక్షలో ఉన్నారు.

కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చలు:

ఒకవైపు వీధుల్లో రసాభాస జరుగుతుండగానే, మరోవైపు సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో రెండుసార్లు భేటీ అయ్యారు. ఉదయం జరిగిన తొలి భేటీలో వారి డిమాండ్లను విన్న మంత్రి, రాతపూర్వక వినతిపత్రం ఇవ్వాలని కోరారు. సాయంత్రం వినతిపత్రం సమర్పించినప్పటికీ, సీజేపీ కోరిన మూడు డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదు. ధర్నాను విరమించి ప్రశాంతతను కాపాడాలని జేపీ నడ్డా కోరారు. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు.

నేడు కూడా పార్లమెంట్ ముట్టడికి పిలుపు:

లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం తర్వాత నిరసనకారులు కేరళ హౌస్ వద్ద, ఆ తర్వాత మళ్లీ జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. మంగళవారం కూడా తమ ‘సంసద్ చలో’ ప్రదర్శన కొనసాగుతుందని, పోరాట స్థలాన్ని వీడేది లేదని స్పష్టం చేశారు. దీంతో నేడు కూడా ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.