NTV Telugu Site icon

Delhi Rains: ఢిల్లీలో భారీ వర్షం.. గంట వ్యవధిలో 11 సెంమీ వాన! స్కూళ్లకు సెలవు

Delhi Rains

Delhi Rains

Red Alert in Delhi after Heavy Rain Fall: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు వీడటం లేదు. బుధవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సెంట్రల్‌ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ అబ్జర్వేటరీలో అయితే ఒక గంట వ్యవధిలో 11 సెంమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చుక్కుకుపోయారు.

డిల్లీలోని చాలా చోట్ల రోడ్లపైకి మోకాల్లోతు నీళ్లు వచ్చాయి. ఐటీవో, ఆర్కేపురం, జన్‌‌‌‌పథ్, పార్లమెంట్ స్ట్రీట్, కరోల్ బాగ్, నౌరోజీ నగర్, పంత్ మార్గ్, మయూర్ విహార్ వంటి ప్రాంతాలు చెరువులను తలపించాయి. రాజేంద్రనగర్‌ ప్రాంతం మరోసారి వరద నీటిలో మునిగిపోయింది. రోడ్లపైకి మోకాలి లోతు నీళ్లు రావడంతో ట్రాఫిక్‌ పోలీసులు ఎక్స్‌ వేదికగా నగర ప్రజలకు సూచనలు జారీ చేశారు.

రావూస్‌ అకాడమీలో ముగ్గురు విద్యార్థుల మృతికి నిరసనగా ఓల్డ్‌ రాజేందర్‌నగర్‌లో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన సివిల్స్‌ అభ్యర్థులు భారీ వర్షంలోనూ ఆందోళన కొనసాగిస్తున్నారు. నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.