NTV Telugu Site icon

Rain: దేశ రాజధానిలో భారీ వర్షం.. జలమయమైన ఢిల్లీ రోడ్లు

Raee

Raee

దేశ రాజధాని ఢిల్లీ భారీ వర్షంతో తడిసిముద్దైంది. సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. మరోవైపు వేడి గాలులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఒక్కసారిగా వాతావరణ చల్లబడడంతో ఉపశమనం పొందారు. చల్లని గాలులను ఢిల్లీ ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఫిరోజ్‌షా రోడ్, కస్తూర్బా గాంధీ మార్గ్‌లో భారీ వర్షం కురిసింది.

గత కొద్ది రోజులుగా దేశ వ్యా్ప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగభగమండిపోతున్నాడు. బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పరిసరాలన్నీ చల్లబడ్డాయి. మరోవైపు వాతావరణం చల్లబడడంతో ఆహ్లాదకరమైన పరిస్థితుల్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ వాన కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర భారత్‌కు చెందిన రాష్ట్రాల జాబితాను కేంద్ర వాతావరణ శాఖ విడుదల చేసింది. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, లడఖ్, గిల్గిత్, బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏప్రిల్ 26 నుంచి 29 వరకు ఈ ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే అధికారులు కూడా అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది.

ఏప్రిల్ 26 నుంచి 29 వరకు జమ్మూకాశ్మీర్, లడఖ్, గిల్గిత్, బాల్టిస్తాన్, ముజఫరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో అయితే ఏప్రిల్ 29న భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. ఆ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షంతో పాటు వడగళ్లు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఉత్తరాఖండ్‌లో ఏప్రిల్ 28-29 తేదీల్లో వడగళ్ల వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఉద్యోగులు, ప్రజలు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపింది.