NTV Telugu Site icon

Swati Maliwal Case: కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ టీమ్.. సీన్ రీకన్‌స్ట్రక్షన్

Swathi

Swathi

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌తో కలిసి పోలీసులు ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. నలుగురు సభ్యులతో కూడిన పోలీసు బృందానికి అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజిత చెప్యాల నేతృత్వంలో ఐదుగురు ఫోరెన్సిక్ నిపుణులు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీస్ బలగాలు చేరుకున్నాయి. సోమవారం ముఖ్యమంత్రి నివాసంలో స్వాతి మాలివాల్‌పై కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ భౌతికదాడికి తెగబడ్డాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇక శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు బృందం.. కేజ్రీవాల్ ఇంటికి వచ్చి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. స్వాతి మలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ కావడం విశేషం. తనపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలని ఆమె ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

కేజ్రీవాల్ నివాసంలోని డ్రాయింగ్ రూమ్ సీసీటీవీ ఫుటేజీని సేకరించనున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన ప్రకారం పోలీసులు.. స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. ఇక తాజాగా లీక్ అయినా వీడియో ప్రకారం.. అందులో ఉన్న సిబ్బందిని కూడా పోలీసులు విచారించనున్నారు. మొబైల్ ఫోన్ ఫుటేజీలో ఉన్న నాయకుడిని కూడా విచారించనున్నారు.

స్వాతి మాలివాల్ ఫిర్యాదు మేరకు కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌పై కేసు నమోదైంది. నేరపూరిత బెదిరింపుల వంటి అభియోగాలను నమోదు చేశారు. ఇదిలా ఉంటే తమ ఎదుట హాజరుకావాలని బిభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది. కానీ అతడు హాజరుకాలేదు. ఇప్పటికే రెండు సార్లు సమన్లు జారీ అయ్యాయి.

ఇక తాజాగా వచ్చిన వీడియోలో స్వాతి మాలివాల్ కనిపించారు. సిబ్బందితో వాగ్వాదం చోటుచేసుకున్న దృశ్యాలు కనిపించాయి. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని స్వాతి మాలివాల్‌కు చెబుతున్న మాటలు వినిపించాయి. దాదాపు 52 సెకన్ల వీడియో ఉంది. కానీ ఆమె మాత్రం అక్కడ నుంచి వెళ్లడానికి ఇష్టపడలేదు. తాను పోలీసులను పిలిచానని.. వారి వచ్చేంత వరకు వెళ్లనని తెలిపారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ నివాసం నుంచి రెండు అత్యవసర కాల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తక్షణమే కేసు నమోదు చేయలేదని.. పోలీస్ స్టేషన్‌కు వచ్చాక ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారని పేర్కొన్నారు.

ఎఫ్ఐఆర్‌లో ఏముందంటే..
ఇదిలా ఉంటే సోమవారం స్వాతి మాలివాల్‌పై దాడి జరగగా.. గురువారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక ఎఫ్ఐఆర్‌లో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేజ్రీవాల్ నివాసంలో తనపై ముఖ్యమంత్రి పీఏ బిభవ్ కుమార్ దాడి చేస్తున్నప్పుడు పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నానని, అయినా కూడా ఎవరూ రాలేదని స్వాతి మాలివాల్ తన ఆవేదనను తెలియజేసింది. తనను కొట్టడమే కాకుండా, దుర్భాషలాడాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆమె తలను టేబుల్‌పై కొట్టినట్లు చెప్పింది. ఎంత బతిమాలినా కొడుతూనే ఉన్నట్లు తెలిపింది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లినట్లు చెప్పింది. అంతకముందు పీఏ బిభవ్ కుమార్‌కు ఫోన్ చేసినా స్పందించలేదని.. వాట్సాప్‌కి టెస్ట్ మెసేజ్ పంపినా రెస్పాన్స్ లేదన్నారు. చేసేదేమీలేక ఎప్పుటి మాదిరిగానే.. కేజ్రీవాల్ ఇంటి ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లినట్లు ఆమె తెలిపింది. కేజ్రీవాల్‌ను కలవడానికి వచ్చినట్లు సిబ్బందికి చెప్పగానే.. డ్రాయింగ్ రూమ్‌లో వేచి ఉండమని చెప్పారు. కేజ్రీవాల్ కోసం ఆమె ఎదురుచూస్తూ ఉంది. ఇంతలో సిబ్బంది వచ్చి ముఖ్యమంత్రి కలవడానికి వస్తున్నారని కబురు అందింది. ఇంతలో అకస్మాత్తుగా బిభవ్ కుమార్ గదిలోకి ప్రవేశించి అరవడం, దుర్భాషలాడడం ప్రారంభించినట్లు తెలిపింది. అంతేకాకుండా మెరుపు వేగంలో దాడికి తెగబడడంతో దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపింది. దాడి చేయొద్దని ఎంత బతిమాలినా ఆగలేదని.. కేజ్రీవాల్‌కు ఫోన్ చేయాలని కోరినా పట్టించుకోకుండా దాడి చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

తనపై అరుస్తూనే.. చెప్పుతో కొట్టడం ప్రారంభించాడని.. 7-8 సార్లు చెప్పుతో కొట్టాడని ఆమె తెలిపింది. పదే పదే సహాయం కోసం అరుస్తూ ఉన్నా ఎవరు పట్టించుకోలేదని వాపోయింది. తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా కాళ్లతో తన్నాడని.. అంతేకాకుండా ఈడ్చికెళ్లాడని.. తన చొక్కా చింపేశాడని ఆమె ఆరోపించింది. బటన్లు కూడా ఊడిపోయాయని తెలిపింది. అంతేకాకుండా అక్కడే ఉన్న టేబుల్‌పై తల కొట్టినట్లు చెప్పింది.

ఛాతీ, పొట్ట, కటి ప్రాంతంలో అత్యధికంగా దాడి చేసినట్లు ఆమె వాపోయింది. ఎంత బతిమాలినా అతడు పశ్చాత్తాపడలేదున్నారు. విపరీతమైన నొప్పి వస్తుందని వేడుకున్నా కొట్టడం ఆగలేదని చెప్పింది. చొక్కా చిరిగిపోయాక.. అంతర్గత భాగాలపై కూడా దాడి చేసినట్లు తెలిపింది. రుతుక్రమంలో ఉన్నానని.. నొప్పి భరించలేకపోతున్నానని పదే పదే వేడుకున్నా కూడా అతడు విడిచిపెట్టలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి ఎలాగోలా విడిపించుకుని.. నేలపై నుంచి కళ్లద్దాలు తీసుకుని బయటపడినట్లు ఆమె పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పింది. ఆ సమయంలో భయంకరమైన షాక్‌లో ఉన్నానని.. తీవ్రమైన బాధలో ఉన్నానని.. అప్పుడే పోలీసు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినట్లు ఆమె తెలిపింది.

నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసుకో.. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. నీ ఎముకులు విరిచి భూమిలో పాతిపెట్టేస్తామని బిభవ్ కుమార్ బెదిరించినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని.. పోలీసులు వచ్చేంత వరకు వెళ్లనని చెప్పినా కూడా బలవంతంగా బయటకు పంపించేశారని చెప్పింది. తీవ్రనొప్పితో కొద్దిసేపు నేలపై కూర్చుని ఉండిపోయినట్లు పేర్కొంది.

స్వాతి మాలివాల్ సమాచారంతో పోలీసు బృందం వెంటనే సంఘటనాస్థలికి చేరుకుంది. కానీ అప్పటికే స్వాతి మాలివాల్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలైంది. సత్వర న్యాయం కోసం ఆమె కోర్టును కూడా ఆశ్రయించారు.

ఇదిలా ఉంటే స్వాతి మాలివాల్ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం స్పందించలేదు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తక్షణమే కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ జరిగిన ఈ సంఘటన ఎటువంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.