Delhi Government: ప్రజా సేవల్లో జాప్యానికి చెక్.. పనులు ఆలస్యం చేస్తే అధికారులకు ఫైన్‌.. సర్కార్‌ కొత్త చట్టం..!

Rekhagupta

Rekhagupta

Delhi Government: ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ పనికి వెళ్లినా.. ఎప్పుడు అవుతుందో తెలియని పరిస్థితి.. దరఖాస్తు చేసుకుని మరి కాళ్ల చెప్పులు అరిగేలా తిరగాల్సిన దుస్థితి.. అయితే, ప్రభుత్వ పాలనను మరింత పారదర్శకంగా, ప్రజలకు జవాబుదారీగా మార్చేందుకు ఢిల్లీలోని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో అనవసర జాప్యాన్ని అరికట్టేందుకు ‘ది ఢిల్లీ రైట్ ఆఫ్ సిటిజన్స్ టు టైమ్-బౌండ్ అండ్ ఈజీ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ యాక్ట్, 2026’ చట్టాన్ని నోటిఫై చేసింది. ఈ కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వ సేవలను నిర్ణీత గడువులోగా అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై జరిమానా విధించనున్నారు.

రోజుకు రూ.250 జరిమానా.. గరిష్ఠంగా రూ.5,000
కొత్త చట్టం ప్రకారం ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వ సేవలను ఎలాంటి సరైన కారణం లేకుండా ఆలస్యం చేసే సంబంధిత అధికారిపై రోజుకు రూ.250 చొప్పున జరిమానా విధిస్తారు. అయితే ఈ జరిమానా గరిష్ఠ పరిమితి రూ.5,000గా నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు పదేపదే తిరగాల్సిన పరిస్థితిని నివారించడం, దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. కేవలం సేవల అందించడంలో జాప్యం చేసినప్పుడే కాకుండా, సరైన కారణాలు లేకుండా ప్రజల దరఖాస్తులను తిరస్కరించినా అధికారులపై చర్యలు తీసుకునేలా ఈ చట్టంలో నిబంధనలు పొందుపరిచారు. ప్రతి ప్రభుత్వ సేవకు నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించడంతో పాటు, ఆ సేవను అందించాల్సిన బాధ్యత కలిగిన అధికారిని కూడా స్పష్టంగా గుర్తిస్తారు. దీంతో ఏ అధికారి వద్ద దరఖాస్తు పెండింగ్‌లో ఉంది? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఆలస్యం జరుగుతోంది? అనే విషయాలపై స్పష్టత రానుంది.

ప్రజలకు సులభంగా, వేగంగా ప్రభుత్వ సేవలు
ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు ఆలస్యం కావడం, దరఖాస్తుల పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టడం వంటి సమస్యలకు అడ్డుకట్ట వేయడమే ఈ చట్టం లక్ష్యం. నిర్ణీత గడువులో సేవలు అందించకపోతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం పెరగడంతో పాటు, పరిపాలనలో పారదర్శకత మెరుగుపడుతుందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన ‘మినిమమ్ గవర్నమెంట్.. మ్యాక్సిమమ్ గవర్నెన్స్’ విధాన స్ఫూర్తితో ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. అర్హులైన ప్రతి పౌరుడికి ప్రభుత్వ సేవలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నిర్ణీత సమయంలో అందాలన్నదే ముఖ్యమంత్రి రేఖా గుప్తా లక్ష్యమని పేర్కొంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా స్పందించే పరిపాలనను అందించడంతో పాటు, ప్రభుత్వ అధికారుల్లో బాధ్యతాయుతమైన పనితీరును పెంపొందించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని స్పష్టం చేసింది.

అధికారుల పనితీరుపై పెరగనున్న పర్యవేక్షణ
ఈ చట్టం అమలుతో ప్రభుత్వ సేవల విషయంలో అధికారుల బాధ్యత మరింత పెరగనుంది. అనవసర జాప్యాలు, కారణం లేకుండా దరఖాస్తుల తిరస్కరణకు అవకాశం లేకుండా చర్యలు తీసుకునే వీలుంటుంది. మొత్తంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా, సులభంగా అందించడంతో పాటు అధికారుల జవాబుదారీతనాన్ని పెంచే దిశగా కీలక అడుగుగా నిలవనుంది. ప్రభుత్వ ఆఫీసులో పని అంటే జాప్యం తప్పదు అనే భావన పోయి.. త్వరగా పనులు పూర్తి చేసే విధంగా ఈ నిర్ణయం దోహద పడుతుందేమో చూడాలి..