NTV Telugu Site icon

Delhi Assembly: కేజ్రీవాల్ షాకింగ్ నిర్ణయం.. ఫ్లోర్‌టెస్ట్‌కు తీర్మానం

Cm Kej

Cm Kej

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆయన విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది. కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన తీర్మానంపై శనివారం సభా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ తీర్మానంపై చర్చ జరగనుంది.

కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి ఇతర రాష్ట్రాల్లో పార్టీలను విచ్ఛిన్నం చేయడం.. ప్రభుత్వాలను పడగొట్టడం చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసు సాకుతో ఆప్ నాయకులను అరెస్టు చేయాలని కేంద్రం భావిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో తాము ఎప్పటికీ గెలవలేమని బీజేపీ ప్రభుత్వానికి తెలుసు కాబట్టే.. ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ విడిపోలేదని.. వారందరూ చెక్కుచెదరలేదని ప్రజలకు చూపించేందుకు తాను అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమైనట్లు కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఆప్‌కు 62, బీజేపీకి 8 స్థానాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు కేజ్రీవాల్ బలపరీక్షకు దిగడం ఆశ్చర్యంగానే ఉంది.

ఇటీవలే జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగానే.. అనంతరం సీఎంగా చంపయ్ సోరెన్ బలపరీక్షలో నెగ్గారు. తాజాగా కేజ్రీవాల్ స్వతహగా బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఆప్‌కు సంపూర్ణ మద్దతు ఉంది. ఈజీగానే విశ్వాస పరీక్షను గెలవొచ్చు. కానీ ఈ మధ్యలో ఎలాంటి రాజకీయాలు జరుగుతాయో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే తమ ఎమ్మెల్యేలను రూ.25కోట్లకు కొనుగోలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆప్ ఆరోపించింది. మరోవైపు ఈనెల 19న తమ ఎదుట హాజరుకావాలని కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఆయన ఐదుసార్లు విచారణకు డుమ్మాకొట్టారు. ఈసారైనా విచారణకు హాజరవుతారో లేదో చూడాలి.