Site icon NTV Telugu

Arvind Kejriwal: దేశం కోసం ప్రాణమైనా ఇస్తా.. సీబీఐ 100 సార్లు పిలిచినా సమాధానమిస్తా..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెబుతానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి.. దాచిపెట్టేందుకు ఏమీ లేదని కేజ్రీవాల్ అన్నారు. తన అరెస్ట్‌కు బీజేపీ ఆదేశాలు ఇచ్చిందని, సీబీఐ వాటిని తప్పక పాటిస్తుందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలపై సీబీఐ విచారణకు హాజరయ్యే ముందు కేజ్రీవాల్ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

తాను అవినీతిపరుడినని కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. ఒకవేళ డబ్బు సంపాదించాలనుకుంటే ఐటీ శాఖలో కమిషనర్‌గా పనిచేసినప్పుడు కోట్లు వెనకేసుకునేవాడినని కేజ్రీవాల్ తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతిపరుడు అయితే.. ప్రపంచంలో మరెవరూ నిజాయితీపరులు కాదన్నట్లేనని ఆయన అన్నారు. దేశాన్ని ప్రేమిస్తా, అవసరమైతే దేశం కోసం జీవితాన్నైనా అర్పిస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. సీబీఐ 100 సార్లు పిలిచినా సమాధానమిస్తానని ఆయన చెప్పారు.

Read Also: Atiq Ahmed: సీఎం యోగి నివాసానికి భద్రత పెంపు.. యూపీలో 144 సెక్షన్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెంట పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా సీబీఐ కార్యాలయానికి వెళ్లనున్నారు. కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించనున్న నేపథ్యంలో రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ముందుజాగ్రత్తగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వెయ్యి మందికి పైగా దళాలతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీబీఐ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. నలుగురు కన్నా ఎక్కువ మంది ఒక్క చోట ఉండకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ఆప్ కార్యాలయం వద్ద కూడా సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.

 

Exit mobile version