NTV Telugu Site icon

Akhilesh Yadav: మనుషులు ఏమైనా రోబోలా? వారానికి 90 గంటల పనిపై మాజీ సీఎం ఘాటు వ్యాఖ్యలు

Akhilesh Yadav

Akhilesh Yadav

Akhilesh Yadav: భారతదేశంలో ఉద్యోగుల పనిగంటలు అనేవి పని చేసే రంగం, ఉద్యోగం స్వభావం, కంపెనీ విధానాలు, ఇంకా ప్రభుత్వ నియమావళులపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా పూర్తి సమయం ఉద్యోగులు వారానికి 40 నుండి 48 గంటల వరకు పని చేస్తారు. అయితే, కొన్ని రంగాల్లో ముఖ్యంగా టెక్, స్టార్టప్, ఫైనాన్స్, మరికొన్ని ప్రైవేట్ రంగాల్లో, ఉద్యోగులు ఎక్కువ సమయం పని చేయడం సాధారణంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారానికి 60 నుండి 80 గంటల వరకు పని చేసే సందర్భాలు కూడా ఉన్నాయి.

Read Also: IPL 2025: టీం కొత్త కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ పేర్లను ప్రకటించిన కేకేఆర్‌

ఇకపోతే తాజాగా, భారతదేశంలో ఉద్యోగుల పనిగంటలపై పెద్ద చర్చ జరుగుతోంది. దీనికి కారణం పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు చేసిన వ్యాఖ్యలు. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భారత యువత వారానికి 70 గంటలు పని చేయాలని సూచించారు. ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌.ఎన్‌.సుబ్రహ్మణ్యన్‌ అయితే ఏకంగా 90 గంటలు పనిచేయాలని అన్నారు. నీతిఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ కూడా వారానికి 80-90 గంటలు పనిచేయాలంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై సమాజంలోని వివిధ వర్గాల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్పీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని సలహా ఇస్తున్నవారు.. మనుషుల గురించి కాకుండా.. రోబోల గురించి మాట్లాడటం లేదుకదా? ఎందుకంటే, మనుషులైతే.. భావోద్వేగాలతో మెలగాలని, కుటుంబంతో కలిసి జీవించాలని అనుకుంటారు. నిజమైన ఆర్థిక పురోగతి అనేది కొద్దిమందికి కాకుండా దేశప్రజలందరికీ లభించాలి. ఉన్నతస్థాయిలో ఉన్న వారు యువత పనికి గరిష్ఠ ప్రయోజనం పొందాలని చూస్తారు. అందుకే వారానికి 90 గంటలు పనిచేయాలని సాధ్యం కానీ సలహాలు ఇస్తారని విమర్శించారు.

Read Also: Viral Video: ఎవడ్రా నువ్వు.. ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నావు.. ఏకంగా కరెంట్ తీగల మీదే మొదలు పెట్టేశావ్

అఖిలేశ్ యాదవ్ సోషల్ మీడియా వేదిక ద్వారా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. ఆయన చెప్పినట్లుగా, ఆర్థిక వ్యవస్థ ఎన్ని ట్రిలియన్లు పెరిగినా.. ఆ ప్రయోజనాలు సామాన్య ప్రజలకు అందకపోతే ఆ పురోగతికి ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. ఆర్థిక ప్రయోజనాలు అందరికీ అందడమే నిజమైన ఆర్థిక న్యాయం. ఈ ప్రభుత్వ హయాంలో అది సాధ్యంకాదు అని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మొత్తానికి, ఉద్యోగుల పనిగంటలపై కొనసాగుతున్న ఈ చర్చలో అఖిలేశ్ యాదవ్ తనదైన శైలిలో స్పందించి, పని సమయం, జీవిత ప్రమేయం మధ్య సమతుల్యత అవసరాన్ని గుర్తు చేశారు.