బెంగళూరులోని ఎస్ఎంవీటీ రైల్వే స్టేషన్ లో ప్లాస్టిక్ డ్రమ్ లో సోమవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. స్టేషన్ లోపల ఉన్న డ్రమ్ లో నుంచి దుర్వాసన రావడంతో డ్రమ్ ను కట్ చేసి చూడగా లోపల మహిళ మృతదేహం బయటపడింది. బయపనహళ్లి రైల్వేస్టేషన్ ఎంట్రీ గేట్స్ లోని ఓ ప్రవేశ మార్గం వద్ద ఈ డ్రమ్ ఉంది. మహిళకు 31 నుంచి 35 ఏళ్ల వయసు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ముగ్గురు యువకులు ఆటోలో డ్రమ్ ను తీసుకు వచ్చి రైల్వే స్టేషన్ ఎంటరెన్స్ వద్ద వదిలివెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
Also Read : Pawan Kalyan: రెండుచోట్ల ఓడిపోయినా.. నన్ను నడిపించింది మీరే
ఏపీలోని మచిలీపట్నం నుంచి బాడీని తీసుకువచ్చారని.. అయితే ప్రత్యేక బృందాన్ని మచిలీపట్నానికి పంపగా ఇంకా మృతదేహాన్ని గుర్తించలేదని పోలీసులు తెలిపారు. మూడు నెలల్లో ఈ తరహా ఘటన ఇది మూడవది కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 4న యశ్వంత్ పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం చివరన బ్లూ ప్లాస్టిక్ డ్రమ్ లో ఓయువతి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. దుపట్టాతో గొంతు బిగించి యువతిని హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఇదే తరహాల గత ఏడాది డిసెంబర్ రెండోవారంలో ఎస్ఎంవీటీ స్టేషన్ లోని ప్యాసింజర్ ట్రైన్ కోచ్ లో గోనే సంచిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మూడు ఘటనల్లోనూ బాధితులు మహిళలే కావడంతో పాటు అందరి వయసూ దాదాపు 30 ఏండ్లు కావడం గమనార్హం. ఈ మూడు కేసులు ఇంకా కొలిక్కిరాలేదని ఈ ఘటనల వెనుక సీరియల్ కిల్లర్ పాత్ర ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానస్పదంగా ఎవరన్న కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also Read : Governor Tamilisai : టీఎస్పీఎస్సీకి రాజ్ భవన్ లేఖ.. పేపర్ లీక్‌పై ఆరా