NTV Telugu Site icon

CWG 2026: కామన్వెల్త్ క్రీడల నుంచి 9 గేమ్స్ ఔట్.. లిస్ట్‌లో క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్!

2026 Commonwealth Games

2026 Commonwealth Games

గ్లాస్గోలో జరిగే 2026 కామన్వెల్త్ క్రీడల నుంచి 9 గేమ్స్‌ను తొలగించారు. క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్‌, రెజ్లింగ్, షూటింగ్, నెట్‌ బాల్, రోడ్‌ రేసింగ్‌ను తొలగించారు. ఈ మేరకు కామన్వెల్త్ క్రీడల సమాఖ్య ఓ ప్రకటన విడుదల చేసింది. ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఈసారి 10 గేమ్స్‌ను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. గ్లాస్గోలోని నాలుగు వేదికలు మాత్రమే ఆటలకు ఆతిథ్యం ఇస్తాయి.

కామన్వెల్త్‌ క్రీడలు నాలుగేళ్లకొసారి జరుగుతాయన్న విషయం తెలిసిందే. 2026లో స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో జరగనున్నాయి. 23వ కామన్వెల్త్ గేమ్స్ జూలై 23 నుంచి ప్రారంభమై ఆగస్టు 2 వరకు కొనసాగుతాయి. 2014లో గ్లాస్గోలోనే కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. 12 సంవత్సరాల తర్వాత గ్లాస్గో మరోసారి ఆతిథ్యం ఇస్తోంది. నిజానికి కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జరగాల్సింది. ఖర్చులు పెరగడంతో విక్టోరియా ఆతిథ్య హక్కులను వదులుకుంది. బర్మింగ్‌హామ్ వేదికగా 2022లో 19 ఈవెంట్‌లను నిర్వహించారు. 2026లో మాత్రం 10 ఈవెంట్‌లను మాత్రమే నిర్వహించాలని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య నిర్ణయించింది.

Also Read: Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్‌.. 83 వేల ఫోన్ 43 వేలకే! బ్యాంకు ఆఫర్స్ అదనం

2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. రెజ్లింగ్‌లో అత్యధికంగా 12 పతకాలు రాగా.. వెయిట్ లిఫ్టింగ్‌లో 10 మెడల్స్ వచ్చాయి. కామన్వెల్త్ క్రీడల సమాఖ్య నిర్ణయం భారత్‌కు ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, క్రికెట్, షూటింగ్‌లో మనకు ఎక్కువ పతకాలు వచ్చే అవకాశం ఉండేది.