NTV Telugu Site icon

IPL 2023 Final: ఐపీఎల్‌లో మిస్టర్‌ కూల్ అరుదైన రికార్డు

Msd

Msd

IPL 2023 Final: ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ.. ఐపీఎల్‌లోనూ సత్తా చాటుతూనే ఉన్నారు.. వన్డే క్రికెట్‌, టెస్ట్‌లకు, టీ-20లకు గుడ్‌బై చెప్పినా.. ఐపీఎల్‌లో మాత్రం ఏ మాత్రం దూకుడు తగ్గలేదు.. చెన్నై సూపర్‌కింగ్స్‌ను తనదైన వ్యూహాలతో ఫైనల్‌కు తీసుకెళ్లిన కూల్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ.. ఇవాళ్టి మ్యాచ్‌తో ఐపీఎల్‌లో రికార్డులకెక్కనున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్‌లో తలపడుతున్న చెన్నై కెప్టెన్‌ ధోనీ.. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డులకెక్కుతున్నాడు. ధోనీ ఇంతవరకు 249 ఐపీఎల్‌ మ్యాచ్‌లాడాడు. 39.09 సగటుతో 5వేల 82 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్‌ సెంచరీలున్నాయి. వికెట్‌ కీపర్‌గా 41 స్టంపింగ్‌లు చేశాడు. 141 క్యాచ్‌లు పట్టుకున్నాడు. ఐపీఎల్‌లో ధోనీ తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ శర్మ, దినేశ్‌ కార్తీక్‌, విరాట్‌ కోహ్లీ ఉన్నారు. ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ 243 మ్యాచ్‌లాడితే, దినేశ్‌ కార్తీక్‌ 242, కోహ్లీ 237 మ్యాచ్‌లు ఆడారు.

Read Also: Sharwanand: శర్వానంద్‌ కారు ప్రమాదం… అదుపు తప్పి బోల్తా

ఇక, ఇవాళ్టి ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలిస్తే.. జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపిన కెప్టెన్‌గా ధోనీ నిలుస్తాడు. కప్‌ కొడితే అటు రోహిత్‌ శర్మ రికార్డును ధోనీ సమం చేసినట్లవుతుంది. ఐపీఎల్‌లో అత్యధికంగా ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు విజేతగా నిలిపాడు రోహిత్‌ శర్మ. ఇప్పటికే చెన్నై సూపర్‌కింగ్స్ కప్‌ అందించిన ధోనీ.. ఇవాళ ఫైనల్‌ గెలిస్తే రోహిత్‌ శర్మ సరసన చేరతాడు. అటు మహేంద్ర సింగ్‌ ధోనీ కోసమైనా చెన్నై జట్టు గెలవాలని దేశవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.