Nandyal: నంద్యాల పట్టణంలో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. రైతు నగర్‌లో నివాసం ఉంటున్న సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ నల్లమల భాస్కరన్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నల్లమల భాస్కరన్ స్వస్థలం తమిళనాడు. సుమారు పదిహేనేళ్ల క్రితం నంద్యాలకు వచ్చి వివాహం చేసుకున్న ఆయన రైతు నగర్‌లో స్థిరపడ్డారు. భాస్కరన్ సీఆర్‌పీఎఫ్ 42వ బెటాలియన్‌కు చెందిన 2005 బ్యాచ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
READ MORE: Garikipati Narasimha Rao: యూట్యూబర్ అన్వేష్‌పై గరికపాటి నరసింహారావు ఫైర్.. వారికి నమస్కారం!
భాస్కరన్‌కు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బనగానపల్లెలో గతంలో మృతి చెందిన ఓ సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ పనుల నిమిత్తం ఉన్నతాధికారులు భాస్కరన్‌ను పంపించారు. ఆ తర్వాత కొంతకాలంగా ఇంటికి వచ్చి వెళ్లుతూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబంలో నెలకొన్న వ్యక్తిగత విభేదాలే అతడి ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమై ఉండొచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
