అంగన్వాడీల గురించి పట్టించుకునే పరిస్ధితి లేకుండా పోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. కనీస వేతనం కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కస్టపడి సాగు చేసుకునే వారి భూములు తీసుకుని.. ట్యాబులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. బలవంతంగా తాళాలు పగలకొట్టి గొడవను ఎక్కువ చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీలో అంగన్వాడీలు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. వాలంటీర్ల చేత అంగన్వాడీ వ్యవస్థను ఎలా నడుపుతారని ప్రశ్నించారు.
‘అంగనవాడీల గురించి పట్టించుకునే పరిస్ధితి లేకుండా పోయింది. కనీస వేతనం కోసం సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణలో 13,600 వేతనం ఇస్తున్నారు. ఇక్కడ అంగన్వాడీల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలి. వ్యవసాయ పంపు సెట్టుకి 20 వేల కోట్లు వెచ్చించారు. ఎవరి కోసం డబ్బుని మురుక్కాలవల్లో పోస్తున్నారు. ప్రధాని మోదీ కోసమా, బీజేపీ కోసమా? ఈ డబ్బు ఖర్చు చేసేది. కస్టపడి సాగు చేసుకునే వారి భూములు తీసుకుని ట్యాబులు ఇస్తున్నారు’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు.
‘బలవంతంగా తాళాలు పగలకొట్టి గొడవను ఎక్కువ చేస్తున్నారు. 5 సంవత్సరాల తరువాత ఇదా వాలంటీర్లకు ఇచ్చే గౌరవం. ఆర్థికంగా డబ్బులు లేవని సాకు చూపించి.. అంగన్వాడీలను పట్టించుకోవడం లేదు. 26వ తేదీ అంగన్వాడీల సమస్య పరిష్కారాని డెడ్ లైన్ పెడుతున్నాం. సమస్య పరిష్కారం చేయకుండా పోలీసులను పంపితే.. మేమంతా బరిలోకి దిగుతాం. 143 మంది ఎంపీల సస్పెన్షన్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాదా?. బీజేపీ అసమర్ధత వల్లనే పార్లమెంటులో గొడవలు జరుగుతున్నాయి. కేంద్ర హోమ్ మినిస్టర్ కి బాధ్యత లేదా?. 26 జిల్లాల్లో రేపు నిరసనలకు నిర్ణయం తీసుకున్నాం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చెప్పారు.
Also Read: Mumbai Indians: ఆ వార్తలు అవాస్తవం.. ఏ ఆటగాడు ముంబై ఇండియన్స్‌ను వీడటం లేదు!
అంగన్వాడీ కార్యకర్తల రాష్ట్ర వ్యాప్త సమ్మె 10వ రోజు చేరింది. రాష్ట్రంలోని అనేక చోట్ల అంగన్వాడీ కార్యకర్తలు పసి పిల్లలతో ర్యాలీలో పాల్గొన్నారు. రోడ్లపై భిక్షాటన, వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలను తాళాలు పగలగొట్టినా, బెదిరింపులకు గురిచేసినా, రాజకీయ ఒత్తిడిలు చేస్తున్నా.. సడలని సంకల్పంతో సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే.. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు.