C.P. Radhakrishnan: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డిని ఓడించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 781 ఓట్లకు గాను మొత్తం 767 ఓట్లు పోలయ్యాయి. ఎన్డీఏ అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించారు. ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. 15 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్డీఏ బలం 427 కాగా.. క్రాస్ ఓటింగ్ జరగడంతో 452 ఓట్లు వచ్చాయి. దీంతో దేశంలోని 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ నిలిచారు. ఈ విజయంతో బీజేపీ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరిసింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో ఎన్డీఏ ఎంపీల వేడుకలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఫలితాలు ప్రకటించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోషి నివాసాన్ని సందర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
READ MORE: Tomato Prices Fall: భారీగా పడిపోయిన టమోటా రేటు.. రైతన్నకు తీవ్ర నష్టం..
కాగా.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ హౌస్‌లో జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ 10 గంటల సమయంలో తొలి ఓటు వేశారు. అనంతరం ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 781 మందిలో మొత్తం 768 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాస్తవానికి.. భారత పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభతో సహా మొత్తం 788 మంది ఎంపీలు ఉండాలి. ప్రస్తుతం రెండు సభలలో 7 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే.. మొత్తం 781 మంది ఎంపీలు ఓటు వేయాల్సి ఉంటుంది. వారిలో 13 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు. వీరిలో బీఆర్ఎస్ నుంచి 4, బీజేడీ నుంచి 7 మంది, శిరోమణి అకాళీదళ్ నుంచి ఒకరు, మరో స్వతంత్ర ఎంపీ ఓటు వేయలేదు. ఎన్డీఏకు చెందిన 427 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
