వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే గ్యారంటీల పేరుతో కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దీంతో ఇదే పద్ధతిని దేశ వ్యాప్తంగా మేనిఫెస్టోలో చేర్చి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం భారీ పథకాలతోనే మేనిఫెస్టో తయారు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మేనిఫెస్టో విడుదలకు కాంగ్రెస్ ముహూర్తం ఖరారు చేసింది.
ఏప్రిల్ 6న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. జైపుర్‌లో జరిగే బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విడుదల చేస్తారని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ సుఖ్‌జిందర్ సింగ్ రంధ్వా వెల్లడించారు. ఢిల్లీలో పార్టీ వార్ రూమ్ భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు.
మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు, 25 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించనుంది. ‘న్యాయ్ పిల్లర్ల’ పేరుతో 25 గ్యారంటీలను ఐదు భాగాలుగా విభజించింది. ‘పీపుల్స్ మేనిఫెస్టో’ పేరుతో దీని రూపకల్పన కోసం కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆధ్వర్యంలోని పార్టీ కమిటీ ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది.
నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, మహిళల హక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు పార్టీ సీనియర్ నేత శశిథరూర్ తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పంటకు కనీస మద్దత ధర చట్టం చేస్తామని ప్రకటించింది. మేనిఫెస్టోలో దీనిపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిరుద్యోగులు, మహిళలు, కార్మికులు, రైతులకు హామీలు ఇచ్చింది. మహిళలకు ‘నారీ న్యాయ్’, రైతులకు ‘కిసాన్ న్యాయ్’పేరిట ఐదు గ్యారంటీలను ప్రకటించింది. నిరుద్యోగులకు ఉపాధి హక్కుతో పాటు, పరీక్ష పత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టం అంశాలను మేనిఫెస్టోలో చేర్చినట్లు సమాచారం.
