CJ Roy Suicide: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ సీజే రాయ్ (CJ Roy) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్న సమయంలోనే ఈ విషాదకర సంఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. బెంగళూరులోని రిచ్‌మండ్ సర్కిల్ ప్రాంతంలో ఉన్న తన కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కంపెనీ పత్రాలను పరిశీలిస్తున్న సమయంలో డాక్టర్ సీజే రాయ్ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అత్యవసర వైద్య సహాయం అందించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు.
ఐటీ దాడుల నేపథ్యంలో ఘటన
ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ వ్యవహారంపై అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, డాక్టర్ సీజే రాయ్ దక్షిణ భారతదేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఆయన స్థాపించిన కాన్ఫిడెంట్ గ్రూప్, కర్ణాటక మరియు కేరళలో వందలాది నివాస, వాణిజ్య ప్రాజెక్టులను చేపట్టి, రియల్ ఎస్టేట్ రంగంలో విశేష స్థానం సంపాదించింది. సంస్థకు యూఏఈలో కూడా కార్యకలాపాలు ఉన్నాయి.
విద్యా, కార్పొరేట్ నేపథ్యం
* పూర్తి పేరు: డాక్టర్ రాయ్ సీజే
* పదవి: కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్
* విద్య: స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో SBS బిజినెస్ స్కూల్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్
* కార్పొరేట్ అనుభవం: కాన్ఫిడెంట్ గ్రూప్ ప్రారంభానికి ముందు ఫార్చ్యూన్ 100 కంపెనీలతో కలిసి పని చేశారు
* వ్యాపార సామ్రాజ్యం కాన్ఫిడెంట్ గ్రూప్ ద్వారా దక్షిణ భారతదేశంలో 200కి పైగా నివాస, వాణిజ్య, టౌన్‌షిప్ ప్రాజెక్టులు
* మౌలిక సదుపాయాలు, ఆతిథ్యం, విద్య, విమానయానం, రిటైల్, వినోదం, అంతర్జాతీయ వాణిజ్యంలో విస్తరణ
* బెంగళూరును కేంద్రంగా చేసుకుని అంతర్జాతీయ స్థాయి కార్యకలాపాలు
సినిమా, వినోద రంగంలో కూడా ముద్ర
రియల్ ఎస్టేట్‌తో పాటు డాక్టర్ సీజే రాయ్ చలనచిత్ర రంగంలో కూడా చురుకైన పాత్ర పోషించారు. ఆయన నిర్మించిన లేదా సహ-నిర్మాతగా వ్యవహరించిన చిత్రాల్లో.. కాసనోవ్వా (2012), లేడీస్ అండ్ జెంటిల్‌మన్ (2013), మెయి హూమ్ మూసా (2022), ఐడెంటిటీ (2025), మరక్కర్: అరబికడలింటే సింహం చిత్రానికి సహ-నిర్మాతగా పనిచేశారు.. అలాగే బిగ్ బాస్ కన్నడ సీజన్ 10కు బహుమతి భాగస్వామిగా కూడా వ్యవహరించారు. ప్రజాసేవ.. డాక్టర్ సీజే రాయ్ దాతృత్వ కార్యక్రమాల్లోనూ ముందుండేవారు. కేరళ, కర్ణాటకల్లో రూ.1 కోటి కంటే ఎక్కువ విలువైన విద్యా స్కాలర్‌షిప్‌లు.. ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి సహకారం.. కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు స్లోవాక్ రిపబ్లిక్ గౌరవ కాన్సుల్గా సేవలు అందించారు..
అయితే, వ్యాపార రంగంలోనే కాకుండా సాంస్కృతిక, సామాజిక రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా డాక్టర్ సీజే రాయ్‌ను పలువురు గుర్తు చేస్తున్నారు. ఆయన మృతి కార్పొరేట్, సినీ, సామాజిక వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
