NTV Telugu Site icon

Cold Waves: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి..

Chali

Chali

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రమంతటా ఉదయం 9 గంటల వరకు మంచుతో కప్పి ఉంటుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో చలిగాలులు మరింత ఎక్కువగా వీచే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్‌ నెలలో ఉత్తరాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈసారి ఉత్తరాంధ్రతో పాటు అన్ని జిల్లాల్లోనూ 2 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలు చోట్ల 9 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అయితే, రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు పడిపోయాయి. సాధారణంగా ఈ టైంలో 26 నుంచి 28 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు ఉండాల్సింది.. కానీ, ప్రస్తుతం 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గిపోయాయి. ఉపరితల ఆవర్తనాల వల్ల చలి ప్రభావం ఇంకా పెరుగె అవకాశం ఉంది.

Read Also: SA vs IND: దక్షిణాఫ్రికా, భారత్‌ మూడో వన్డే నేడు.. తెలుగు ఆటగాడిపై వేటు!

అలాగే, తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సైతం పడిపోతున్నాయి. చలి విపరీతంగా పెరిగిపోతుంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో వాతావరణం చల్లగా ఉంటోంది. రాత్రిపూట కాకుండా పగలు కూడా చలిగాలులు వణికిస్తున్నాయి. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని కారణంగా ఇవాళ, రేపు తెలంగాణలో పొడి వాతవరణం ఏర్పాడే ఛాన్స్ ఉంది. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు మాత్రం చలి విషయంలో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెదర్ డిపార్ట్మెంట్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.