NTV Telugu Site icon

Jagananna Chedodu: వారికి శుభవార్త.. కాసేపట్లో ఖాతాల్లో రూ.10 వేలు జమ..

Cm Ys Jagan

Cm Ys Jagan

Jagananna Chedodu: సంక్షేమ పథకాల అమలులో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌ ముందుంది.. వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు సాయం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ రోజు శ్రీకారం చుడుతున్నారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వేదికకానుంది.. వైడబ్ల్యూసీఎస్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో బటన్‌ నొక్కి ఈ పథకం లబ్దిదారులకు నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్‌.. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్లకు రూ.325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.. జగనన్న చేదుడో పథకం కింది రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల మంది లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున ఆర్ధిక చేయూత అందిస్తోన్న విషయం విదితమే.. వర్చువల్ గా లబ్దిదారుల ఖాతాల్లో ఈ రోజు నిధులు జమ చేయనున్నారు.. ఇప్పటి వరకు ఈ పథకం కింద ప్రభుత్వం అందించిన మొత్తం రూ.1252.52 కోట్లుగా ఉంది.

జగనన్న చేదోడు పథకం కింద షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ. 10,000 చొప్పున సాయం చేస్తూ వస్తుంది వైసీపీ సర్కార్.. ఈ రోజు అందించనున్న సాయంతో కలిపి ఒక్కొక్కరికి రూ.40,000 వరకు ఆర్థిక సాయం అందించింది.. ఈ స్కీమ్‌ కింద నాలుగేళ్లలో లబ్దిదారులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లకు చేరనుంది.. రాష్ట్రంలోని 1,80,656 మంది టైలర్లకు ఈ విడత సాయంగా రూ. 180.66 కోట్ల లబ్ధి చేకూరనుండగా.. 39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 39.81 కోట్ల లబ్ధి చేకూర్చనున్నారు.. ఇక, 1,04,551 మంది రజకులకు ఈ విడతలో రూ. 104.55 కోట్ల లబ్ధి జరగనుంది.

ఇక, ఈ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేదోడు లబ్ధిదారులకు నిధులు విడుదల చేసే కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరుకానున్న విషయం విదితమే కాగా.. సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన ఇలా కొనసాగనుంది.. ఉదయం 9.45 గంటలకు ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న సీఎం.. అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో బయల్దేరి ఉదయం 10.15 గంటలకు ఎమ్మిగనూరు చేరుకుంటారు.. వీవర్స్ కాలనీ మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఉదయం 11 నుంచి 11.55 గంటల వరకు పాల్గొంటారు.. బటన్‌ నొక్కి జగనన్న చేదోడు పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు.. ఆ తర్వాత తిరుగుప్రయాణం కానున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.