NTV Telugu Site icon

CM YS Jagan: చంద్రబాబుకు ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్టే.. మన ప్రభుత్వంతో వచ్చిన మార్పును చూడండి..

Ap Cm

Ap Cm

CM YS Jagan: చంద్రబాబుకు ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్టేనని మరోసారి హెచ్చరించారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లి దగ్గర సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవ్వా, తాతల మధ్య మీతో మమేకం కావటం సంతోషంగా ఉందన్నారు. మన ప్రభుత్వం రాకముందు మనకు ఎంత పెన్షన్ వచ్చిందో ఆలోచన చేయాలి.. గత ఎన్నికలకు రెండు నెలలకు ముందు వరకు పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే.. ఆ ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్పును గమనించాలని సూచించారు. పెన్షన్ ను ఇళ్ళ వద్దకు తీసుకువెళ్ళి ఇచ్చే కార్యక్రమాన్ని దేశంలోనే మొదటిసారిగా మొదలుపెట్టాం.. ప్రతీ గ్రామంలో ఓ గ్రామ సచివాలయం ఏర్పాటు చేశాం.. ప్రతీ యాభై ఇళ్ళకు ఓ వాలంటీర్ ను పెట్టాం.. 56 నెలలుగా ఒకటవ తేదీ ఏ సెలవు రోజైనా పెన్షన్ ఇళ్ళ వద్దకు తీసుకువెళ్ళి ఇచ్చేలా ఏర్పాటు చేశామని గుర్తుచేశారు సీఎం జగన్‌.

ఇక, గతంలో పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది.. గతంలో పార్టీలు చూసి పెన్షన్లు ఇచ్చేవారు.. ఇప్పుడు మీ ప్రభుత్వంలో పార్టీలు చూసి పెన్షన్లు ఇచ్చే విధానం లేదన్నారు ఏపీ సీఎం.. గతంలో 39 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే.. ఇప్పుడు 66.34 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం అన్నారు. నేను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను అని చెప్పుకునే చంద్రబాబు ఏ రోజైనా మీ గురించి ఆలోచించారా..? అని ప్రశ్నించారు. రాజకీయాలు ఎలా ఉన్నాయో మీరే చూస్తున్నారు.. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చూస్తున్నాం.. ఎన్నికల ముందు రంగురంగుల మేనిఫెస్టోలు కనిపించేవి.. ఎన్నికల తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసే పరిస్థితి.. కానీ, మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలు నెరవేర్చి మీ ముందుకు వచ్చానని తెలిపారు.

మీ బిడ్డకు అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం రాదు.. కూటమి నేతల మాదిరిగా నాకు అబద్ధాలు చెప్పటం రాదు.. మీ బిడ్డ ఏదైనా చెప్పాడు అంటే చేసి చూపిస్తాడు అని స్పష్టం చేశారు సీఎం జగన్‌.. కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచుతున్నా.. జనాభా ప్రకారం చూస్తే అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే.. మూడు వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశం లోనే ఎక్కడా లేదు.. గత ప్రభుత్వ హయాంలో నెలకు 400 కోట్లు కూడా కాదు.. మన ప్రభుత్వంలో నెలకు రెండు వేల కోట్ల పెన్షన్.. ఏటా 24 వేల కోట్లు పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నాం.. పెన్షన్ ఇవ్వటంలో మనతో పోటీ పడే రాష్ట్రాలు లేవన్నారు. రేపు పెన్షన్లు నాలుగు వేలు చేస్తాం, ఐదు వేలు చేస్తాం అని కూటమి నేతలు చెబుతారు.. నేను చెప్పనివి కూడా చాలా చేశా.. ఏదైనా నేను చెప్పాను అంటే అది కచ్చితంగా చేసి తీరుతాను అన్నారు. 2014లో ఏం జరిగిందో మీకు తెలియాలనే అన్ని విషయాలు సిద్ధం సభల ద్వారా చెబుతున్నా.. గతంలో కూటమి నేతలు 2014 లో జతకట్టినప్పుడు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదన్నారు.

మోసం చేసే వాళ్ళను నమ్మొద్దు అని సూచించారు సీఎం జగన్‌.. ఎక్కడా అవినీతికి తావు లేకుండా మార్పు తెచ్చాం.. చంద్రబాబు హామీలు లక్షా నలభై వేల కోట్లు దాటుతుంది.. చంద్రబాబు సునాయాసంగా నోట్లోంచి అబద్ధాలు చెబుతున్నారు.. చంద్రబాబుకు ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్లే అని హెచ్చరించారు. ఆచరణ సాధ్యం కాని హామీలు మరోసారి చంద్రబాబు గుప్పిస్తున్నారని మండిపడ్డారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, వెంకటాచలంపల్లి దగ్గర సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. పెన్షన్ల పంపిణీపై లభిదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.. సీఎం జగన్ ముందు ఈనెల సచివాలయాల వద్దకు వెళ్లి పెన్షన్ తెచ్చుకునేందుకు తాము పడ్డ ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు వివరించారు.