భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిల వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్‌లో డిసెంబర్ 22 రాత్రి 11.20కి సింధు, సాయిలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.
మంగళవారం పీవీ సింధు, వెంకట దత్త సాయిల రిసెప్షన్ ఘనంగా జరిగింది. రాజకీయ, సినిమా, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు వివాహ విందుకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. హైదరాబాద్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన రిసెప్షన్‌కు తెలంగాణ సీఎం సీఎం రేవంత్ రెడ్డి హాజరై నూతన జంట సింధు, సాయిలను ఆశీర్వదించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కొత్త జంటకు ఆశీస్సులు అందించారు.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు గురుసాయి దత్.. షట్లర్లు ప్రణయ్, చిరాగ్ శెట్టిలు పీవీ సింధు, వెంకట దత్త సాయిల రిసెప్షన్‌కు హాజరయ్యారు. సినీ తారలు చిరంజీవి, నాగార్జున, అజిత్, ఆలీ, అర్జున్, మృణాల్ ఠాకూర్ తదితరులు నూతన జంటను ఆశీర్వదించారు. హరీష్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సుజనా చౌదరి, ఏపీ జితేందర్‌రెడ్డి, చాముండేశ్వరీనాథ్, శైలజా కిరణ్, బృహతి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.