తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత స్వతంత్ర వజ్రోత్సవాల పేరిట 15 రోజులగా ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. నేడు ఎల్బీ స్టేడియంలో ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరయ్యారు. స్టేడియం వద్దకు సీఎం కేసీఆర్ రాగానే ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్టేడియంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ ముగింపు వేడుకల్లో శాసన మండలి చైర్మన్, శాసన సభ స్పీకర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులు, వేలాదిగా ఆహుతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ.. పేదల ఆశలు నెరవేరలేదన్నారు. అనేక వర్గాల ప్రజలు తమకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందట్లేదనే ఆవేదన మనకు కనబడుతుందని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. వాటన్నింటిని విస్మరించి ఈ దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసేందుకు కుటిల ప్రయత్నాలు జరగడాన్ని మనమంతా చూస్తున్నామని, మౌనం వహించడం సరికాదని, అర్థమైన తర్వాత కూడా అర్థం కానట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్ని అయితే సక్రమమైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం గొప్పగా పురోగమించే అవకాశం ఉంటుందని, మన దేశంలో మన రాష్ట్రానిది ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు సీఎం కేసీఆర్. స్వతంత్ర భారత స్ఫూర్తిని ఈ తరం పిల్లలకు, యువకులకు తెలియని వారికి విస్తృతంగా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు సీఎం కేసీఆర్. అన్నింటిని మించి ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాను చెప్పినట్లు విశ్వజనీనమైన సిద్ధాంతాన్ని, అహింసా వాదాన్ని, ఎంతటి శక్తిశాలులైనా సరే శాంతియుత ఉద్యమాలతో జయించొచ్చని ప్రపంచ మానవాళికి సందేశం ఇచ్చిన మహ్మత్ముడు పుట్టిన గడ్డ మన భారతావని. అటువంటి దేశంలో గాంధీ గురించి, ఆయన యొక్క ఆచరణ గురించి, స్వాతంత్య్ర పోరాటంలో ఉజ్వలంగా వారు నిర్వహించిన పాత్ర గురించి ఈతరం పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.
