NTV Telugu Site icon

CM JaganMohan Reddy: చంద్రబాబుపై జగన్ సెటైర్లు..పంచతంత్రం కథ చెప్పిన సీఎం

Jaga11

Jaga11

ఏపీలో ఎన్నికలకు ముందే రాజకీయం వేడెక్కింది. అవకాశం ఎప్పుడొచ్చినా విపక్షాలపై విమర్శలు, సెటైర్లు వేస్తున్నారు సీఎం జగన్. వసతి దీవెన పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేసే సభలో జగన్ తనదైన రీతిలో సెటైర్లు వేశారు. శింగనమల నియోజకవర్గం నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. నార్పల క్రాస్‌రోడ్స్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, జగనన్న వసతి దీవెన కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై కథ చెప్పారు సీఎం జగన్.

ఒక ముసలాయన.. ఈ మధ్య జాతీయ మీడియాకు వచ్చి రాని భాషలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన మాటలు వినేటప్పుడు.. నాకొక కథ గుర్తుకొచ్చింది. అది మన అందరికీ ఇష్టమైన, నీతిని పంచే పంచ తంత్రంలోని కథ.. అనగనగా ఓ పులి ఉండేదట. ఆ పులి మనిషి మాంసం ఒక పద్థతి ప్రకారం రెగ్యులర్‌గా తినేది. సంవత్సరాలుగా నరమాంసం తినేందుకు అలవాటుపడ్డ పులి.. ఏళ్లు గడిచాక ముసలిదైపోయింది. వేటాడే శక్తి, పరిగెత్తే ఓపిక పోయింది. ఉన్నచోటే కూర్చుని.. నాలుగు నక్కలను తోడేసుకుంది. మనుషుల్ని ఎలా తినాలనే ప్లాన్‌ వేసుకుంది. దారిలో ఓ మడుగు పక్క కూర్చుని.. వచ్చీపోయే మనుషులకు నగల్ని ఆశ చూపెట్టేది.. ‘‘తమ్ముళ్లూ.. కడియం కావాలంటే నీటిలో మునగాలి’’ అంటూ ఊరించేది. ‘‘ఈ పులిని నమ్మాం అంటే.. తినేస్తుంది కదా’’ అని అందరూ నమ్మకుండా పోయారు. కానీ, ఆ పులి మాత్రం నేను సీనియర్‌ మోస్ట్‌ పులిని. అడవిలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ ఉంది. గతంలో బాగా తినేవాడని.. ఇప్పుడు మంచోడినైపోయి తినదల్చుకోలేదు. పైగా వయసు పెరిగింది. రామా.. కృష్ణా.. అంటూ మంచి కార్యక్రమాల కోసమే ఉన్నాను. పులి ముసలిది అయిపోయింది కదా.. అని కాస్తో కూస్తో నమ్మిన వాళ్లూ మడుగులో వెళ్లి నీట మునిగి ఆ నగలు తీసుకునే ప్రయత్నం చేసేవాళ్లు. ఆ మడుగులో బురదతో ఇరుక్కుంటే.. పులి చంపేసి తినేసేది.

ఈ కథ చెప్పే నీతి ఏంటంటే.. వెన్నుపోటు పొడిచేవాళ్లను, అబద్ధాలు ఆడేవారిని, వంచకుల్ని, మాయమాటలు చెప్పేవాళ్లని ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదు. ఈ కథ వింటే గుర్తొచ్చేది.. అబద్ధాలు కళ్లారప్పకుండా చెప్పే ఓ ముసలాయాన గుర్తొస్తాడు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు.. వేటాడే శక్తి కోల్పోయిన పులి, గుంట నక్కల్నివెంటేసుకుని తిరిగినట్లు ఉంది చంద్రబాబు తీరు. బంగారు కడియం ఇస్తానంటాడు. జాబు రావాలంటే బాబు రావాలంట.. బాబుకు ఎప్పటికీ బుద్ధిరాదని అనిపిస్తోంది. నేను సీనియర్‌ని, ఇప్పుడు మంచోడ్ని అయ్యాను అంటూ నమ్మించే యత్నం చేస్తాడు. కానీ, చంద్రబాబు లాంటి వంచకుడిని ప్రజలు ఎప్పటికీ నమ్మకూడదు అని సీఎం జగన్‌ పిలుపు ఇచ్చారు.

Read Also:California Senate : అమెరికాలో కుల వివక్ష నిషేధ బిల్లుకు కాలిఫోర్నియా ఆమోదం

చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతుల్ని నండా ముంచారు. అక్కాచెల్లెమ్మల పొదుపు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని బ్యాంకులు వేలం వేశాయప్పుడు. సున్నా వడ్డ పథకాన్ని రద్దు చేశాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. మొండి చేయి చూపాడు. ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు మరిన్ని అబద్ధాలు చెబుతాడు. దోచుకో, పంచుకో.. ఇదే చంద్రబాబు సిద్ధాంతం. చంద్రబాబుకు తోడుగా ఓ గజదొంగల ముఠా ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీరికి తోడుగా దత్తపుత్రుడు.. ఇది గజదొంగల ముఠా. బాబు అబద్ధాలను, మోసాలను నమ్మకండి. జగనన్న వల్ల మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకోండి.. ఆలోచించండి. మీ జగనన్న నమ్ముకున్నది దేవుడి దయను, ప్రజలను. నా నమ్మకం, నా ఆత్మ విశ్వాసం ప్రజలే అని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మీ దీవెనలు నాకు కావాలి అని ఆయన ప్రజలను కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది. గత ప్రభుత్వంలో అరకొరగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయడమేగాక 2017 నుంచి పెండింగ్‌ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లను కూడా వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లించింది. ఈ బకాయిలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద ఇప్పటివరకు వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,223.60 కోట్లు. వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం క్ర‌మం త‌ప్ప‌కుండా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అందిస్తోంది. విద్యారంగంలో అనేక సంస్క‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుట్టిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలోనే ఒక్క విద్యా రంగంపై రూ.58,555.07 కోట్లు ఖ‌ర్చు చేశారు.

Read Also: Sudan Rescue Mission: కొనసాగుతున్న ఆపరేషన్ కావేరీ.. జెద్దా చేరుకున్న భారతీయులు