Site icon NTV Telugu

CM Jaganmohan Reddy: చేసిన మంచిని ఓట్ల రూపంలో మార్చండి

Ys Jagan Mohan Reddy

Ys Jagan Mohan Reddy

రాజాం నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం ‌సమావేశం అయ్యారు. నిన్న కుప్పంలో టీడీపీ ఓటమి కోసం క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు జగన్. ఇవాళ రాజాంలో కార్యకర్తలకు ఉత్సాహం నింపారు. క్యాంపు కార్యాలయంలో రాజాం నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి ముఖ్యమైన కార్యకర్తలను కలుస్తున్నాను. దీంట్లో భాగంగా రాజాం నియోజకవర్గం కార్యకర్తలనూ కలుస్తున్నాను. గతంలో ఉన్న ప్రభుత్వ పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకూ ఉన్న తేడాను గమనించండి. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మనం చేసిన మంచిని మరింత విపులంగా చెప్పాలి. మనం చేసిన మంచిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలి. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకన్నా.. ఈసారి మరింతపెరగాలి. రాజాం నియోజకవర్గానికి సంబంధించి కేవలం డీబీటీ కిందే రూ.775 కోట్లు ఇచ్చాం అని వివరించారు జగన్.

ప్రతి ఇంటికీ వారి వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశాం. మేనిఫెస్టో ద్వారా చేసిన వాగ్దానాల్లో 95శాతం నిలబెట్టుకున్నాం.ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ గడపగడపకూ కార్యక్రమంలో ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ వాస్తవాలు అయితేనే మళ్లీ మా ప్రభుత్వాన్ని, జగనన్నను ఆ శీర్వదించండి అని ధైర్యంగా ప్రతి ఇంటికీ వెళ్లగలుగుతున్నాం. మంచి చేసిన తర్వాతనే మనం ప్రతి ఇంటికీ వెళ్లి ఆశీస్సులు అడుగుతున్నాం. ఈ నియోజకవర్గంలో 12,403 ఇంటి స్థలాలు ఇచ్చాం అన్నారు జగన్.

దాదాపు రూ.240 కోట్లు విలువైన ఇంటి పట్టాలు ఇచ్చాం. వీటిలో 9,509 ఇళ్లను ఇప్పుడు కడుతున్నాం. వీటి విలువ కనీసంగా మరో రూ.171 కోట్లు ఉంటుంది. ఇలా మంచి చేసిన తర్వాతనే ప్రతి ఇంటికీ వెళ్లి ఆశీస్సులు అడిగే కార్యక్రమాన్ని చేస్తున్నాం. సంతృప్తస్థాయిలో అర్హత ఉన్న ఏ ఒక్కరికీ కూడా నిరాకరించకుండా నాన్నగారి హయాంలో ఇచ్చారు. ఈరోజు అదే నిజాయితీతో, అదే అంకిత భావంతో మనం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ ధైర్యంగా వెళ్లగలుగుతున్నాం. అర్హత ఉండీ రాని పరిస్థితి లేదు. ఇక మనం చేయాల్సింది.. చేసిన మంచిని ఓట్ల రూపంలో మార్చుకోవాలి.

దీనికి కార్యకర్తలుగా మీ కృషి ఎంతో అవసరం. పార్టీ పరంగా జిల్లా, మండలస్థాయి, గ్రామ స్థాయి వరకూ కమిటీలు ఏర్పాటు కావాలి. దాదాపు 24 అనుబంధ విభాగాలు మనకు ఉన్నాయి. ఈ విభాగాలన్నింటికీ కమిటీలు ఏర్పాటు కావాలి. ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాలి. బూత్‌ కమిటీలు కూడా ఏర్పాటు కావాలి. వీలైనంత వరకూ ప్రతి కమిటీలో కూడా కచ్చితంగా యాభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా చూసుకోవాలి. మొత్తం కమిటీలో యాభైశాతం మహిళలు ఉండేలా చూడాలి.వీరిని భాగస్వామ్యం చేయాలి. సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున ప్రాధాన్యతా పనులకు మంజూరు కూడా చేస్తున్నాం.

మళ్లీ మనం అఖండ మెజార్టీతో గెలవాలి. ఈసారి మన టార్గెట్‌ 151 కాదు, 175 కి 175 సీట్లు. ఈ టార్గెట్‌ కష్టంకాదు. మీ నియోజకవర్గంలో ఏమేర లబ్ధి జరిగిందో, ప్రతి నియోజకవర్గంలోనూ జరిగింది. 87శాతం కుటుంబాలకు పథకాలు అందాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఘనవిజయాలు సాధించాం. మున్సిపాల్టీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాల్టీ ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాం.

ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అంతకుముందు ప్రజలకు ఏదైనా అందాలంటే.. పది మంది చుట్టూ తిరగాలి, తిరగాలి లంచాలు ఇచ్చుకోవాలి. ఇంతచేసినా ఊర్లో వేయి మంది ఉంటే నలుగురికో, పదిమందికో అందేవి. ఇప్పుడు ఆ అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వివక్ష లేకుండా, పక్షపాతం లేకుండా ప్రజలకు అందుతున్నాయి.గతంలో సచివాలయ వ్యవస్థ అనేదే లేదు. నాలుగు అడుగులు వేస్తే ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. నాలుగు అడుగులు వేస్తే విలేజ్‌క్లినిక్స్‌ కనిపిస్తున్నాయి. నాలుగు అడుగులు వేస్తే ఇంగ్లిషు మీడియం స్కూళ్లు కనిపిస్తున్నాయన్నారు జగన్.

నేడు గ్రామాల్లో ఇలాంటి వ్యవస్థ ఇప్పుడు ఉంది. విద్య, వ్యవసాయం, ఆరోగ్యరంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చాం. ఆరోగ్యశ్రీ కింద 3వేలకుపైగా చికిత్సలకు వర్తింపు చేస్తున్నాం. మన గ్రామంలోనే మన కళ్లముందే మార్పులు కనిపిస్తున్నాయి. ప్రజలకు ఇవన్నీకూడా చెప్పాలి, వారి మద్దతును తీసుకోవాలి. మీతోడు జగన్‌కు కావాలి. మనం అంతా ఇంకా 30 సంవత్సరాలు కలిసికట్టుగా రాజకీయాలు చేయాలి. జీవిత కాలం మిగిలిపోయే విధంగా మనం అంతా చరిత్రను లిఖించాలి. ఇవన్నీ చూశాక 30ఏళ్లపాటు మనమే ఉండాలని ప్రజలే ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు జగన్.
NTV Special Story T.Congress : “చేతి”ని ఎందుకు వదులుతున్నారో..

Exit mobile version