CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు

Cbn

Cbn

CM Chandrababu: రాయలసీమలోని ఉద్యాన పంటల హబ్‌ను గ్లోబల్ ప్రూట్ బౌల్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అక్టోబరు 2వ తేదీన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేసి ఉద్యాన హబ్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు సీఎం వెల్లడించారు. గతంలో కరువు, వర్షాభావంతో వెనుకబడిన రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ప్రకాశంతో కలిపి రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లతో రాయలసీమ ఇంటిగ్రేటెడ్‌ హార్టీకల్చర్‌ హబ్‌ గా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. సచివాలయంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సుమారు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు అక్టోబరు 2న శ్రీకారం చుట్టనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. ఇందులో ప్రభుత్వం రూ.40 వేల కోట్లు, ప్రైవేటు రంగం రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన పంటల హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. రాయలసీమ హార్టీకల్చర్ హబ్ కార్యక్రమంలో రైతులు, ప్రజలను పెద్దఎత్తున భాగస్వాములను చేస్తూ పండుగలా నిర్వహించాలని సూచించారు. ప్రతి రైతూ ఇదే నా భవిష్యత్తు అనే భావన కలిగేలా కార్యక్రమాలు ఉండాలని అన్నారు. గతంలో రాయలసీమలో తీవ్రమైన కరవు, వర్షాభావ పరిస్థితులు ఉండేవని.. ఇప్పుడు ఆ పరిస్థితులను మార్చి అభివృద్ధి దిశగా వివిధ కార్యక్రమాలు చేపట్టామని సీఎం పేర్కొన్నారు. సూక్ష్మ సేద్యం నుంచి హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల ద్వారా కరవు సీమకు నీటిని తరలించడంతో పాటు, ఫామ్‌ పాండ్లు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం వంటి చర్యలతో వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా సుమారు 660 కిలోమీటర్ల మేర కుప్పం వరకు నీటిని తీసుకెళ్లగలిగామని తెలిపారు. కియా నుంచి ఆమ్కా డిఫెన్సు ప్రాజెక్టు వరకూ పరిశ్రమల ఏర్పాటుతో రాయలసీమలో పారిశ్రామిక మార్పు చోటుచేసుకుందని, ఇప్పుడు ఉద్యాన రంగం ద్వారా తదుపరి స్థాయి ఆర్థిక పరివర్తన సాధించాలని సీఎం ఆకాంక్షించారు. కరువును అవకాశంగా మార్చుకుని క్షామం నుంచి అభివృద్ధి వైపు రాయలసీమ రూపాంతరం చెందుతోందని అన్నారు.

10 జిల్లాల్లోని 201 క్లస్టర్లలో ఉద్యాన పంటలు, ఎఫ్‌పీఓలు, ఆహార శుద్ధి పరిశ్రమలు, మార్కెటింగ్‌ వ్యవస్థలను అనుసంధానం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్లస్టర్‌, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయాలని సూచించారు. డ్వాక్రా సంఘాల తరహాలో రైతులు పరస్పరం సహకరించుకుంటూ ఎఫ్‌పీఓలుగా ఏర్పడి తమ ఉత్పత్తులను సమష్టిగా మార్కెట్‌ చేసుకునే విధానాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. ఉద్యాన పంటల సాగులో కొత్త రకాల పంటల ఎంపిక, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటు, మార్కెటింగ్‌ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న పంటలపై దృష్టి సారించి ఫలితాలు సాధించేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. రాయలసీమలో వివిధ రకాల పండ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని, ఇక్కడ ఉత్పత్తి అయ్యే అనేక రకాల పండ్లకు ప్రపంచ మార్కెట్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. రాయలసీమ ఇంటిగ్రేటెడ్‌ హార్టీకల్చర్‌ హబ్‌ ద్వారా వచ్చే 5-6 ఏళ్లలో రాయలసీమను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు. జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లోని అవకాశాలను గుర్తించి వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి క్లస్టర్‌లో రైతులను చాంపియన్‌ ఫార్మర్లుగా రైతులను తీర్చిదిద్దేలా కార్యాచరణ ఉండాలని అన్నారు.

అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ఇంటిగ్రేటెడ్‌ హార్టీకల్చర్‌ హబ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషదాయకమని సీఎం వ్యాఖ్యానించారు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు కూడా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. మన ఉద్యాన ఉత్పత్తులు విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసేలా ఈ హబ్ కు శ్రీకారం చుడుతున్నామని స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రకాశం సహా రాయలసీమ జిల్లాల్లోని 201 క్లస్టర్ల లోని రైతులను కూడా వర్చువల్ గా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. 3 వేల పైచిలుకు రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శనలు క్లస్టర్‌ వారీగా కార్యక్రమాలు నిర్వహించి ఉద్యాన హబ్‌ ఆవిర్భావాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పారు. రాయలసీమ సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్లస్టర్‌ స్థాయిలో వర్క్‌షాప్‌లు, ట్రాక్టర్‌ ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ఉద్యాన పంటల సాగు ద్వారా రైతుల జీవితాల్లో వచ్చిన మార్పులను ప్రజలకు తెలియజేయాలని సీఎం సూచించారు. ఉద్యాన పంటల ద్వారా పెరిగిన రైతుల ఆదాయం, కొత్త పంటలతో వారి జీవన ప్రమాణాలు ఎలా మారాయన్న అంశాలను తెలియచెప్పాలని స్పష్టం చేశారు. రాయలసీమ హార్టీకల్చర్‌ హబ్‌నూ ప్రజలు స్వాగతించేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఉత్పత్తి, వినియోగం, వాణిజ్య అవకాశాలను పరిగణనలోకి తీసుకుని పంటల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. శనగ, మినుము, పెసర, కంది, రాగులు, మొక్కజొన్న, జొన్నలు, ఉల్లి తదితర పంటల సాగు, కొనుగోళ్లు, కనీస మద్దతు ధరల అంశాలపై కేంద్రాన్ని సంప్రదించాలని నిర్ణయించారు. ప్రత్యామ్నాయ పంటల ద్వారా ప్రతీ ఎకరానూ సాగులోకి తీసుకు రావటం ద్వారా ఎల్ నినో ప్రభావాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖలో ఏఐ ఆధారిత విశ్లేషణ వ్యవస్థను ఉపయోగించి ఏ ప్రాంతంలో ఏ పంట సాగు చేస్తే రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం ఉంటుందో గుర్తించాలని సూచించారు. ద్రవ్యోల్బణం పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పప్పు దినుసులు, చిరు ధాన్యాల లాంటి 14 రకాల పంటల ధరలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా, వినియోగదారులకు ధరల భారం పడకుండా సమతుల్య విధానం అవలంబించాలని సూచించారు. ఇకపై ప్రతి వారం ద్రవ్యోల్బణంపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం తెలిపారు. ఆరోగ్యపరంగా ప్రజలు వంటనూనె వినియోగాన్ని పరిమితం చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. రాగి, జొన్న, సజ్జ తదితర చిరు ధాన్యాల వినియోగాన్ని పెంచేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..