CM Chandrababu: రైతులు ఫుడ్‌ ప్రాసెసింగ్‌లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!

Cm Chandrababu

Cm Chandrababu

రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచించారు. వ్యవసాయాన్ని కేవలం పంటల ఉత్పత్తిగా కాకుండా.. ఆర్థిక శక్తిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో పాప్‌కార్న్‌ ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ పరిశ్రమను ప్రస్తావిస్తూ.. వినూత్న ఆలోచనలతోనే వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రైతులపై ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఎంతో ప్రేమ ఉందని చంద్రబాబు అన్నారు.

పాప్‌కార్న్‌ పరిశ్రమ గురించి పత్రికలో చదివి రైతులను ప్రోత్సహించేందుకు ఆయన వచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ‘నూజివీడులో ఇలాంటి వినూత్న ఆవిష్కరణ జరగడం రాష్ట్రానికి గర్వకారణం. దేశవ్యాప్తంగా సుమారు 3,400 సినిమా థియేటర్లకు పాప్‌కార్న్‌ సరఫరా చేసే స్థాయికి ఈ పరిశ్రమ ఎదిగింది. పాప్‌కార్న్‌ ఉత్పత్తి సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్‌ చేసి విలువను పెంచితే రైతులకు మరింత ఆదాయం లభిస్తుంది. అరకు కాఫీ, పామాయిల్‌, మిరప, మామిడి, పసుపు, మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు రాష్ట్రానికి గర్వకారణం. వీటికి ప్రత్యేక బ్రాండ్లు రూపొందించి అంతర్జాతీయ మార్కెట్లకు పంపితే మంచి డిమాండ్‌ ఉంటుంది’ అని సీఎం పేర్కొన్నారు.

‘ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ఆహార ఉత్పత్తుల్లో కేవలం 10 శాతం మాత్రమే ప్రాసెసింగ్‌ లేదా ఎగుమతి స్థాయికి వెళ్తున్నాయి. ఈ వాటాను 50 శాతానికి పెంచగలిగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుంది. రైతులు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలోకి వచ్చి వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసుకోవాలి. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల నమూనాలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. బియ్యం వినియోగం తగ్గుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రైతులు సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని కొత్త పంటలను ఎంచుకోవాలని ప్రభుత్వం మార్గనిర్దేశం చేస్తోంది’ అని సీఎం తెలిపారు.

నీటి వనరుల అభివృద్ధిపై కూడా సీఎం చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చింతలపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పూర్తయితే నూజివీడు ప్రాంతానికి మరింత ప్రయోజనం కలుగుతుంది. ఈ ప్రాజెక్టును రెండు, మూడు ఏళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ఈ నెల 31న ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పోలవరం ఎడమ కాల్వ నుంచి సుజల స్రవంతి ద్వారా ఈ నెలలోనే అనకాపల్లికి నీరు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నాము. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం 50 శాతానికి పైగా తగ్గింది. ఇది రైతులకు పెద్ద సవాలుగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’ అని సీఎం చంద్రబాబు సూచించారు.

సెప్టెంబర్‌లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ ఏర్పాటు చేసే ప్రణాళికను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే ఐదు నదులను అనుసంధానం చేసే అవకాశంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ నదుల అనుసంధానం సాకారం అయితే నాలుగు రాష్ట్రాల్లో నీటి సమస్యలకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆధునిక సాంకేతికత, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, నీటి వనరులు, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసి రైతుల ఆదాయాన్ని పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. రైతులు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే.. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి మరింత ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు.