18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ కప్‌ను సొంతం చేసుకోవడంతో.. విజయోత్సవాల కోసం బుధవారం (జూన్ 4) మధ్యాహ్నం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియానికి అభిమానులు భారీగా పోటెత్తారు. అంచనాకు మించి.. లక్షలాది సంఖ్యలో ఫాన్స్ స్టేడియానికి రావడంతో వారిని అదుపుచేయడం పోలీసుల వల్ల కాలేదు. సరిగ్గా అదే సమయంలో వర్షం కూడా రావడంతో.. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 50 మంది వరకు గాయపడగా.. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
Also Read: Yuzvendra Chahal: చహల్ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడు!
బెంగళూరు తొక్కిసలాట ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కన్న బిడ్డను కోల్పోయిన ఓ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. తన కుమారుడి శరీరాన్ని ముక్కలు చేయొద్దంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. ‘నాకు ఒక్కడే కొడుకు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నా. ఆర్సీబీ విజయోత్సవాల కోసం ఇంట్లో చెప్పకుండా స్టేడియంకు వచ్చాడు. తొక్కిసలాటలో నా కొడుకు చనిపోయాడు. మమల్ని ఎవరు పరామర్శించినా చనిపోయిన నా బిడ్డను తిరిగి తీసుకురాలేరు. పోస్టుమార్టం పేరుతో నా కొడుకు శరీరాన్ని ముక్కలు చేయకండి. దయచేసి నా బిడ్డ మృతదేహాన్ని అప్పగించండి’ అంటూ ఓ తండ్రి వేడుకున్నాడు. ఈ ఘటన అందరినీ కలచివేసింది.
