Site icon NTV Telugu

ప్రధాని మోడీని కలిసిన చినజీయర్ స్వామి

2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ముచ్చింతల్‌లోని దివ్యసాకేతంలో 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహం ఆవిష్కరణకు.. ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఆ సమతా మూర్తి విగ్రహావిష్కరణకు హాజరు కావాలంటూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వానాన్ని మన్నించారు ప్రధాని మోడీ.దేశం గర్వించే ఈ బృహత్కార్యంలో తాను తప్పక పాల్గొంటానన్నారు. ప్రపంచానికి సమతా సందేశాన్ని అందించే లక్ష్యంతో.. భగవద్రామానుజుల మహా విగ్రహాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు ప్రధాని! ఈ మహాకార్యం సాకారం చేసిన చిన్నజీయర్‌ స్వామి సంకల్పాన్ని కొనియాడారు.

ప్రధానిని ఆహ్వానించిన చిన్నజీయర్‌ స్వామి వెంట.. మై హోం గ్రూపు చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు ఉన్నారు. సహస్ర కాంతుల దీపం భగవద్రామానుజులు. విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులు. ఈ భువిపై ఆ పావనమూర్తి అవతరించి వెయ్యేళ్లు. అందుకే..ఆ సమతామూర్తికి కృతజ్ఞతగా.. వచ్చే ఏడాది 2 నుంచి 14వ తేదీ వరకూ సహస్రాబ్ది మహోత్సవాలను శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో వైభవంగా నిర్వహించేందుకు తలపెట్టారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి. వారి సత్య సంకల్పం సిద్ధించి.. దివ్య సాకేతంలో 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహం రూపుదిద్దుకుంది.

ముచ్చింతల్‌లోని దివ్య సాకేతంలో శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల సంరంభం సందర్భంగా.. సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగం చేస్తారు. ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణలను స్వయంగా కలిసి.. ఈ మహోత్సవాలకు రావాలంటూ ఆత్మీయ ఆహ్వానం పలికారు చినజీయర్‌ స్వామి. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, అశ్విని కుమార్‌ చౌబే, శోభా కరంద్లాజే, భూపిందర్‌ యాదవ్‌తోబాటు ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌లను కూడా కలిసి..శ్రీ రామానుజాచార్యుల మహా విగ్రహావిష్కరణ సాదరంగా ఆహ్వానించారు.

Exit mobile version