Site icon NTV Telugu

China : చైనాలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి సైన్యం నుంచి ఔట్ !

China Military Purge

China Military Purge

China: ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలని ఉత్సాహపడుతున్న దేశం చైనా. ఇటీవల ట్రంప్ సుంకాల యుద్ధంతో వార్తల్లో నిలిచిన ఈ దేశం మారోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి సొంత దేశంలో వెలుగు చూసిన ఆశ్చర్యకరమైన పరిస్థితులు వార్తల్లో నిలిచేలా చేశాయి. వాస్తవానికి ఇప్పుడు డ్రాగన్ దేశంలో జి జిన్‌పింగ్ వారసుడు ఎవరు అనే దానిపై చర్చ జరుగుతుంది. ఈ సమయంలో చైనాలో ఒక పెద్ద కలకలం చోటుచేసుకుంది. చైనా సైన్యంలో రెండవ అత్యున్నత స్థాయి సైనిక నాయకుడు, అలాగే ఆ దేశ కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయిన హి వీడాంగ్‌ను తాజాగా ఆయన పదవి నుంచి తొలగించారు. అలాగే ఆయనకు పొలిట్‌బ్యూరో నుంచి కూడా ఉద్వాసన పలికారు.

READ ALSO: AP Liquor Scam Case: ఏపీ లిక్కర్‌ కేసులో నిందితులకు షాక్‌..

ఎందుకు తొలగించారంటే..
తీవ్రమైన అవినీతి ఆరోపణల కారణంగా వీడాంగ్‌ను పదవి నుంచి తొలగించినట్లు చైనా ప్రభుత్వం చెబుతోంది. వీడాంగ్ ఇంకా దీనిపై వ్యాఖ్యానించలేదు. ఈ నెల చివర్లో జరగనున్న చైనా ప్రభుత్వం, పార్టీ కీలకమైన వార్షిక సమావేశానికి కొన్ని రోజుల ముందు ఆయనను తొలగించే నిర్ణయం వెలువడటంతో డ్రాగన్ దేశంలో కలకలం రేగుతుంది. వాస్తవానికి జిన్‌పింగ్ తర్వాత చైనా సైన్యంలో వీడాంగ్ రెండవ అత్యున్నత స్థాయి సైనిక నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాంటిది ఆయన తొలగింపు నిర్ణయం బయటికి రావడంతో ఒక్కసారిగా దేశంలో కలకలం రేగింది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. వీడాంగ్‌తో పాటు మరో ఏడుగురు ఆర్మీ జనరల్‌లను అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. వీరిలో మియావో హువా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడు హి హాంగ్‌జున్, CMC జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్‌కు చెందిన వాంగ్ జియుబిన్ ఉన్నారు.

హి వీడాంగ్ ఎవరు?
హి వీడాంగ్ 1957లో చైనాలోని ఫుజియాన్‌లో జన్మించారు. ఆయన తన ప్రాథమిక విద్యను తన గ్రామ పాఠశాలలో పూర్తి చేశారు. తరువాత ఆయన చైనీస్ ఆర్మీకి చెందిన నాన్జింగ్ మిలిటరీ స్కూల్‌లో గ్రాడ్యుయేట్ స్కూల్‌కు వెళ్లారు. తర్వాత ఆయన సైన్యంలో చేరారు. 2012లో జి జిన్‌పింగ్ అధికారంలోకి రావడంతో వీడాంగ్ స్థాయి పెరగడం ప్రారంభమైంది. 2013లో ఆయన ఫస్ట్ జియాంగ్సు మిలిటరీ డిస్ట్రిక్ట్‌కు కమాండర్‌గా నియమితులయ్యారు. తర్వాత మార్చి 2014లో వీడాంగ్ షాంఘై గారిసన్ కమాండ్‌కు కమాండర్‌గా నియమితులయ్యారు. 2016లో వీడాంగ్ పనితీరును గుర్తించి జి జిన్‌పింగ్ ప్రభుత్వం ఆయన్ని వెస్ట్రన్ థియేటర్ కమాండ్ గ్రౌండ్ ఫోర్స్‌కు కమాండ్‌గా నియమించింది. 2018లో కేంద్ర స్థాయికి నియమించారు. అదే ఏడాది ఆయనకు తూర్పు కమాండ్‌కు కూడా కమాండ్ ఇచ్చారు.

2022లో వీడాంగ్‌ను చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అధ్యక్షతన ఉన్న సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు వైస్ ఛైచైర్మన్‌గా నియమించారు. వైస్ ఛైర్మన్ పదవి చైనా సైన్యంలో అత్యంత ముఖ్యమైనది. అధ్యక్షుడి తర్వాత వీడాంగ్ సైన్యంలో అత్యంత ప్రభావవంతమైన సభ్యుడు. వీడాంగ్‌ను సైన్యంలో తన డిప్యూటీగా నియమించడంతో పాటు జి జిన్‌పింగ్ ఆయనను పార్టీ పొలిట్‌బ్యూరోకు కూడా నియమించారు. రెండేళ్లపాటు ఇద్దరి మధ్య పరిస్థితులు బాగానే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ 2024లో వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, ఆ తర్వాత వీడాంగ్ అదృశ్యమయ్యాడని పేర్కొన్నారు. తాజాగా ఇప్పుడు చైనా ప్రభుత్వం అధికారికంగా వీడాంగ్‌ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి ఒకప్పుడు చైనా అధ్యక్షుడి వారసుడిగా వీడాంగ్‌ను పరిగణించారు. అలాంటిది ఆయన రెండేళ్లుగా కనిపించకపోవడం, తాజాగా ఉద్వాసన పలకడం వంటి చర్యలు చోటుచేసుకోవడంతో జిన్‌పింగ్ వారసుడు ఎవరు కానున్నారనే దానితో పాటు వీడాంగ్ ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారు అనేది చాలా కీలకంగా మారింది.

READ ALSO: Tejas Mk1A: భారత వైమానిక దళంలో చేరిన తిరుగులేని శక్తి.. తేజస్ Mk1A రాకతో శత్రువులకు చావే!

Exit mobile version