NTV Telugu Site icon

China Flood: భారీ వర్షాలతో ఇబ్బందుల్లో చైనా.. హైవే కూలి 36 మంది మృతి

China

China

china: గత కొన్ని రోజులుగా డ్రాగన్ కంట్రీ చైనాలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాల దెబ్బకు చైనా దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తాజాగా చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైవే రోడ్డు కుంగడంతో వాహనాలు గొయ్యిలో పడిపోవడంతో 36 మంది మరణించారు అని అధికారులు చెప్పారు. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని మిజౌ, డాబు కౌంటీల మధ్య ఉన్న హైవేలోని కొంతభాగం బుధవారం నాడు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా భూమి లోపలికి కుంగిపోయింది. కొండప్రాంతంలో ఉన్న ఈ రోడ్డు కింది భాగంలోని మట్టి మొత్తం కొట్టుకుపోవడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆకస్మాత్తుగా ఇలా జరగడంతో వేగంగా వచ్చిన వాహనాలు కొన్ని కింది పడిపోయాయి.

Read Also: Pushpa2 : వివాదాల నడుమ జనసేన గుర్తుతో అల్లు అర్జున్ ప్రచారం?

అయితే, గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు మెయిజౌ నగర ప్రభుత్వం తెలిపింది. కాగా, హైవేపై ఉన్న 20 వెహికల్స్ పడిపోవడంతో ఈ ప్రమాదంలో దాదాపు 36 మందికి పైగా మరణించగా.. మరో 30 మంది గాయపడ్డారని ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఇక, 500 మంది రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో గత రెండు వారాలుగా రికార్డు స్థాయిలో వడగళ్ల వర్షం కురుస్తుండటంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. గత వారాంతంలో ప్రావిన్షియల్ రాజధాని గ్వాంగ్‌జౌలో సుడిగాలి దెబ్బకు ఐదుగురు మరణించారు. మెయిజౌలోని కొన్ని గ్రామాలు ఏప్రిల్ ప్రారంభంలో ముంపునకు గురయ్యాయి.