Cheteshwar Pujara: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రారంభానికి కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య గట్టి పోటీని అభిమానులు చూడనున్నారు. భారత జట్టు చివరిసారిగా 2020-21లో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు 2-1తో సిరీస్‌ను గెలుచుకున్నారు. అయితే, ఈసారి కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆస్ట్రేలియాలో భారతదేశం చివరి బోర్డర్-గవాస్కర్ సిరీస్ విజయంలో రైట్ హ్యాండ్ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చెతేశ్వర్ పుజారా ముఖ్యమైన పాత్ర పోషించాడు. అయితే భారత జట్టు ఈసారి మైదానంలో అతని సేవలను కోల్పోతుంది.
అయితే, పుజారా అభిమానులకు శుభవార్త. అతను ఆస్ట్రేలియాకు వెళ్లబోతున్నాడు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ రాబోయే సిరీస్‌లో వ్యాఖ్యాతగా కొత్త పాత్రలో టోర్నమెంట్‌కు తిరిగి రాబోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ విజయంలో భారత టెస్ట్ జట్టులో బ్యాటింగ్ యూనిట్‌లో చెతేశ్వర్ పుజారా ముఖ్యమైన పాత్ర పోషించాడు. 2018-19లో ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో పుజారా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అక్కడ అతను 7 ఇన్నింగ్స్‌లలో 74.42 సగటుతో 521 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఈ అద్భుత ప్రదర్శనకు అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. అతని ప్రదర్శన కారణంగా ఆస్ట్రేలియా గడ్డపై భారత్ తొలి సిరీస్ విజయం సాధించింది. మొత్తంమీద ఆస్ట్రేలియా గడ్డపై 36 ఏళ్ల పుజారా 11 మ్యాచ్‌ల్లో 47.28 సగటుతో 993 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి.
ఇకపోతే, 1991-92 తర్వాత తొలిసారిగా భారత్, ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడనున్నాయి. పెర్త్‌లో మొదటి మ్యాచ్ తర్వాత, రెండవ మ్యాచ్ అడిలైడ్ ఓవల్‌లో పింక్ బాల్ తో ఆడనుంది. మూడు, నాలుగో టెస్టులు బ్రిస్బేన్, మెల్‌బోర్న్‌లలో జరగనున్నాయి. ఇక ఈ సిరీస్ చివరి మ్యాచ్ జనవరి 3 నుండి 7 వరకు సిడ్నీలో జరుగుతుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 పూర్తి షెడ్యూల్ ఇలా..
* మొదటి టెస్ట్: నవంబర్ 22 నుండి 26 వరకు – పెర్త్
* రెండవ టెస్ట్ : డిసెంబర్ 6 నుండి 10 వరకు – అడిలైడ్
* మూడో టెస్ట్: డిసెంబర్ 14 నుండి 18 వరకు – బ్రిస్బేన్
* నాల్గవ టెస్ట్: 26 నుండి 30 డిసెంబర్ – మెల్బోర్న్
* ఐదవ టెస్ట్: జనవరి 3 నుండి 7 వరకు – సిడ్నీ.