Chandrayaan-3: భారతీయ అంతరిక్ష సంస్థ(ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టనుంది. జులైలో చంద్రయాన్-3 ప్రాజెక్టును చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన పనులను అపుడే ప్రారంభించినట్టు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. సోమవారం జీఎస్ఎల్వీ-ఎఫ్12 రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా ప్రయోగించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ గురించి విలేకరులు ప్రశ్నించగా.. చంద్రయాన్-3 ప్రాజెక్టును జూలైలో నిర్వహించనున్నట్టు తెలిపారు. జులైలో పూర్తి చేయనున్నట్టు సోమనాథ్ తెలిపారు. దాని గురించి వివరిస్తూ.. చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్‌లో మొత్తం మూడు రకాల మాడ్యూల్స్ ఉంటాయన్నారు. అందులో మొదటిది ప్రొపల్షన్ మాడ్యూల్ కాగా రెండోది ల్యాండర్ మాడ్యూల్ అని మూడవది రోవర్ మాడ్యూల్ ఉండనున్నాయని చెప్పారు. ఇప్పటికే ఇస్రో రెండు సార్లు చంద్రుడిపైకి వ్యోమనౌకలను పంపించిందని గుర్తు చేశారు.
బెంగుళూరులో యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో రూపుదిద్దుకున్న మూన్ శాటిలైట్ ఇప్పటికే శ్రీహరికోటకు చేరుకున్నదని తెలిపారు సోమనాథ్. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో చంద్రయాన్-3ను తీసుకువెళ్లే ఎల్‌వీఎం రాకెట్‌ను రూపొందిస్తున్నట్టు సోమనాథ్ స్పష్టం చేశారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్ మూడు వారాల్లో మూన్ వద్దకు వెళ్లనున్నదని చెప్పారు. చంద్రయాన్-2 ద్వారా పంపిన ఆర్బిటార్ ఇంకా పని చేస్తోందని.. మూన్ ఉపరితలంపై ఉన్న ఆ ఆర్బిటార్ ఇంకా హై రెజల్యూషన్ ఇమేజ్‌లను పంపుతోందని సోమనాథ్ మీడియాకు చెప్పారు.
కాగా, ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఎన్‌వీఎస్-01 ఉపగ్రహంతో ఉదయం 10:42 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-12 వాహనకౌక.. నిర్ధిష్టమైన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.. ఇక, ఈ ప్రయోగం ద్వారా భారత నావిగేషన్ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు.. నావిగేషన్ సేవల కోసం గతంలో పంపిన వాటిలో నాలుగు ఉపగ్రహాల జీవిత కాలం ముగిసిపోగా.. వాటి స్థానంలో ప్రతి ఆరు నెలలకు ఒక ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతోంది ఇస్రో.. ఇక, జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-12 ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో శాస్త్రవేత్తల సంబరాలు అంబరాన్ని తాకాయి.. ఈ ప్రయోగంలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్.