NTV Telugu Site icon

Chandrababu Arrest: 50 రోజులకు చేరిన చంద్రబాబు రిమాండ్‌.. నేడు ములాఖత్‌కు లోకేష్‌, భువనేశ్వరీ

Cbn

Cbn

Chandrababu Arrest: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. ఆయన రిమాండ్‌ ఇవాళ్టితో 50వ రోజుకు చేరింది.. స్కిల్ స్కామ్‌ కేసులో గత నెల 9వ తేదీన అరెస్ట్‌ అయ్యారు చంద్రబాబు.. నవంబర్ 1వ తేదీ వరకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం చంద్రబాబు రిమాండ్ పొడిగించిన విషయం విదితమే.. ఇక, ఈ రోజు చంద్రబాబును ములాఖత్‌లో కలవనున్నారు నారా లోకేష్ , భువనేశ్వరీ, మరో టీడీపీ సీనియర్ నేత.. ఉదయం 11 గంటలకు ములాఖత్‌లో సమావేశం కానున్నారు..

మరోవైపు, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. లేఖాస్త్రం సంధించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారుల ద్వారా.. ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖపంపించారు చంద్రబాబు. తమ అధినేత భద్రతపై ఇప్పటి వరకు టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. ఇప్పుడు స్వయంగా చంద్రబాబే తన సెక్యూరిటీపై సందేహాలు వెలిబుచ్చారు. రాజమండ్రి జైల్లోని భద్రతా లోపాల్ని ఏసీబీ కోర్టు జడ్జికి రాసిన లేఖలో ప్రస్తావించారు. ఈనెల 25వ తేదీన చంద్రబాబు మూడు పేజీల లేఖ రాసారు. అందులో చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. రాజమండ్రి జైల్లోని పలు లోపాలు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న తన ప్రాణాలకు ముప్పుగా పరిణమించినట్లు చంద్రబాబు తెలిపారు. సెప్టెంబర్ 10న తనను అరెస్టు చేసి 11న రాజమండ్రి జైలుకు రిమాండ్‌కు పంపారని, జైల్లోకి తాను ప్రవేశిస్తున్న సమయంలో తనను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపించారు. అలా తన ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు… తన భద్రతకు ముప్పు కలిగించారని చంద్రబాబు పేర్కొన్నారు.

తనను హత్య చేసేందుకు ఓ వామపక్ష తీవ్రవాద సంస్థ కుట్రపన్నిందని.. భారీగా డబ్బులు చేతులు మారినట్లు చంద్రబాబు ఆరోపించారు. అంతేకాకుండా.. మావోయిస్టుల నుంచి బెదిరింపుల లేఖ వచ్చినా.. దానిపై ఇప్పటి వరకు విచారణ జరపడం కానీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎస్ కోటకి చెందిన ఓ ముద్దాయి జైల్లో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నారని.. తన దృష్టికి వచ్చిందని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. అలాగే తన కదలికలను చిత్రీకరించడానికి జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారని.. తన కుటుంబసభ్యులు జైలుకు వచ్చినప్పుడు కూడా డ్రోన్‌ ఎగరేశారన్నారు. తనకే కాదు, తన కుటుంబసభ్యులకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో ఉన్నానని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. జైల్లోకి గంజాయి ప్యాకెట్లు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే.. తనతో పాటు, తన కుటుంబానికి కూడా ముప్పు ఉందని చంద్రబాబునాయుడు అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు, రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదన్నారు కోస్తాంధ్ర జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌. నిత్యం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. తన భద్రతపై చంద్రబాబు రాసిన లేఖ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఏం జరుగుతోందా అని తెలుగు తమ్ముళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.