NTV Telugu Site icon

Champai Soren: ఝార్ఖండ్ కొత్త సీఎం చంపై సోరెన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Campi Soran

Campi Soran

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవి నుంచి హేమంత్ సొరెన్ తప్పుకున్నారు. కొత్త సీఎంగా చంపై సొరెన్‌ను జేఎంఎం శాసనసభాపక్షం ఎన్నుకుంది. చంపై సొరెన్‌ను తదుపరి సీఎంగా ఎన్నుకున్నట్లు జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. హేమంత్ సొరెన్‌పై ఈడీ విచారణ నేపథ్యంలో జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చంపై సోరెన్ బృందం గవర్నర్‌ రాధాకృష్ణన్‌ను కలిసి తెలియజేశారు. ప్రమాణస్వీకారానికి సమయం కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

చంపై సోరెన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ప్రారంభించినప్పటి నుండి హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్‌తో కలిసి చంపై సోరెన్ పనిచేశారు. చంపై పార్టీలో చాలా సీనియర్ నాయకుడిగా ఉన్నారు. చంపై సొరేన్ ఝార్ఖండ్ రవాణా శాఖా మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిగా కూడా పని చేశారు. సరైకేలా-ఖర్సావాన్ జిల్లాకు చెందిన రైతు సిమల్ సోరెన్ పెద్ద కుమారుడు చంపై సొరెన్. హేమంత్ సొరెన్ కుటుంబానికి బాగా సన్నిహితుడిగా పేరుంది. అంతేకాదు ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చంపై సొరెన్ విశేష కృషి చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చంపై సోరెన్‌కు ముఖ్యమంత్రిగా అవకాశం లభించినట్లు తెలుస్తోంది.

ఇక మనీలాండరింగ్ కేసులో హేమంత సోరెన్ అరెస్ట్ అయ్యారు. అంతకముందు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ముఖ్యమంత్రి పదవికి హేమంత్ రాజీనామా చేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ఎన్నుకున్నట్లు జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలు గవర్నర్‌కు తెలియజేశారు.

ఇదిలా ఉంటే హేమంత్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే ఆయన సతీమణి కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రతిపాదనను కుటుంబ సభ్యురాలైన సీతా సోరెన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు కూడా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో శాసనసభాపక్షం చంపై సోరెన్ వైపు మొగ్గు చూపింది.