ప్రపంచ నాగరికత ఆవిర్భావం నుంచి వివిధ సందర్భాల్లో భిన్నమైన డిమాండ్లు, అవసరాలతో ఉద్యమాలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆమాటకొస్తే ప్రపంచ పరిణామ క్రమంలో కీలక మార్పులకు ఉద్యమాలే ఆసరాగా నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రతి దేశంలోనూ కీలక మలుపులో కచ్చితంగా ఉద్యమాలు వచ్చిన వాస్తవం బోధపడుతుంది. అలా ఎన్నో ఉద్యమాలు వచ్చినా.. ప్రతి ఉద్యమం ఓ నేతను పుట్టించలేదు. కేవలం విజయవంతమైన ఉద్యమాలు మాత్రమే నేతల్ని పుట్టించగలవు. కానీ వాటిలోనూ కొన్ని ఉద్యమాల నుంచి మాత్రమే ప్రముఖులు పుట్టుకొచ్చారు. వారి నాయకత్వానికి మాత్రమే జేజేలు దక్కాయి. అంతమాత్రాన మిగతావారు పోరాడలేదని కాదు. ఇక్కడ కేవలం ఉద్యమం తీసుకురావడం కాదు.. దానికి ప్రాతిపదిక ఏమిటి..? లక్ష్యసాధనలో జనాన్ని ఎలా భాగస్వాముల్ని చేయాలి..? ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని ఎలా ప్రతిబింబించాలి..? వంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు, హేతుబద్ధత ఉన్న నాయకుల పేర్లు మాత్రమే చరిత్రలో నిలిచిపోయాయి. మిగతావారు కష్టపడ్డా.. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదనే అభిప్రాయాలు మిగిలాయి. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
ప్రపంచ వ్యాప్తంగా గడచిన 2-3 వందల సంవత్సరాల్లో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. జాతుల పోరాటాలు, ఉనికి కోసం ఉద్యమాలు, స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం పోరాటాలు.. ఒకదేశం ఆధిపత్యం నుంచి తప్పించరకోడానికి మరోదేశం చేసే ఉద్యమాలు, పోరాటాలు.. ఇలా ఎన్నో చూశాం. ఏ పోరాటంలో అయినా, ఏ ఉద్యమంలో అయినా, నాయకుడికే పేరెక్కువ వస్తుంది. ఎవరికో ఒక్కరికే ఆ క్రెడిట్ దక్కుతుంది. సౌతాఫ్రికాలో నల్లజాతీయుల హక్కుల కోసం, స్వయంపాలన కోసం నెల్సన్ మండేలా అలుపెరుగని పోరాటం చేశాడు. 27 సంవత్సరాలు జైల్లోనే గడిపాడు. మండేలాతో పాటు లక్షలాది మంది నల్లజాతీయులు పోరాడారు. కొన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమంలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు. కుటుంబాలకు కుటుంబాలే కనుమరుగయ్యాయి. కానీ ఆ ఉద్యమం ఘనత నెల్సన్ మండేలాకే దక్కింది. ఏ ఉద్యమంలో అయినా, ఏ పోరాటంలో అయినా, నాయకుడికే ఆ క్రెడిట్ దక్కుతుంది. అది కొన్ని శతాబ్దాలో దశాబ్దాలో నిలుస్తుంది.
ఇదే కోవలో భారత స్వాంతంత్ర్యోద్యమం ఘనత మహాత్మాగాంధీకే దక్కింది. ఈ ఉద్యమంలో కొన్ని కోట్ల మంది దేశ ప్రజలు పాల్గొని.. ధన, మాన, ప్రాణత్యాగాలు చేశారు. మహాత్ముడికి మద్దతుగా ఎందరో నేతలు ఎక్కడికక్కడ ఉద్యమించి ప్రజల్ని కదలించారు. తమ వంతుగా స్వాతంత్రోద్యమ స్ఫూర్తి కొడిగట్టకుండా కాపాడారు. నిజానికి గాంధీ సీన్ లోకి రాక ముందు నుంచే స్వాతంత్రోద్యమం ఉంది. లాల్, బాల్, పాల్ వంటి నేతలు ముందే దేశ నేతలుగా ఉన్నారు. కానీ గాంధీ ఎంటరయ్యేసరికి.. స్వాతంత్రోద్యమం దేశమంతా ఒకే ఊపులో లేదు. కేవలం కొన్ని నగరాలు, మరికొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. అందులోనూ కొన్ని వర్గాలే ఉద్యమంలో యాక్టివ్‌గా ఉన్నారు. కానీ గాంధీ వచ్చాకే స్వాతంత్రోద్యమ స్ఫూర్తి దేశవ్యాప్తంగా విస్తరించింది. అందుకు గాంధీ అనుసరించిన వ్యూహాలు కీలకంగా పనిచేశాయి. మొదట దేశ పర్యటన చేసిన గాంధీ.. ఆ తర్వాత దేశ ప్రజల సంస్కృతి, జీవన స్థితిగతుల్ని అవగతం చేసుకుని.. అందుకు అనుగుణంగా ఉద్యమాన్ని నిర్మించి అనుకున్న లక్ష్యం సాధించారు. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే సాధనాలే ఆయుధాలుగా గాంధీ వాడిన తీరు.. స్వాతంత్రోద్యమానికి కొత్త ఊపిరిలూదటమే కాకుండా.. అనూహ్య బలాన్నిచ్చిందనేది చరిత్ర చెప్పే సత్యం. అంతేకాదు ఏ ఉద్యమం చేసినా.. ఏ నినాదం ఎత్తుకున్నా.. గాంధీజీ ప్రతిసారీ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిచేలా సకల జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు వేసే ప్రతి అడుగులోనూ స్వాతంత్ర్యంతో పాటు ప్రస్తుత జనం సమస్యల్ని అడ్రస్ చేసేలా, వారి అభిప్రాయాలు గమనంలోకి తీసుకునేలా రచించిన వ్యూహమే అసాధారణ ప్రభావం చూపింది. అందుకే నేతగా గాంధీ ప్రభావం దేశాల సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. చివరకు తరాలు మారినా అజరామరంగా నిలిచిపోయింది.
ఏతావాతా ఓ నాయకుడికి పేరు రావాలంటే.. తన లక్ష్యంపై చిత్తశుద్ధి ఉండాలి. అలాగే తనతో పాటు ప్రజల్ని నడిపించే నిబద్ధత కావాలి. అంతే కాదు.. ఉద్యమ పోకడపై సరైన అవగాహన ఉండాలి. వ్యక్తిగత లబ్ధి కంటే సామూహిక స్ఫూర్తే ప్రధానంగా కనిపించాలి. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఏ ఉద్యమమైనా విజయవంతమౌతుంది.అంతేకానీ పదిమందిని పోగోస్తేనే.. వంద మందితో గలాటా చేయిస్తేనే.. అది ఉద్యమం అయిపోదనే సంగతి అందరూ గ్రహించాలి. నిజానికి ఓ ఉద్యమం విజయవంతమయ్యే ప్రాసెస్‌లో.. ఆ ఉద్యమ నేతకు పేరు రావడం సహజ పరిణామంగానే జరగాల్సి ఉంది. అందుకోసం ప్రత్యేక ప్రయత్నాలు చేయడం కూడా కలిసిరాకపోవచ్చు. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయిన నేతలెవరూ.. తమ స్వార్థం చూసుకోలేదు. తామేమైపోయినా పర్లేదు.. అనుకున్న లక్ష్యం నెరవేరితే చాలనే అంకితభావంతోనే పనిచేశారు. ఈ క్రమంలో కొందరు నేతలు చాదస్తులుగా ముద్ర వేయించుకున్నారు. మరికొందరి ఆలోచనే మూర్ఖంగా ఉందనే అపప్రథ కూడా తప్పలేదు. అయినా సరే వారెవరూ తమ స్ఫూర్తిదాయక ప్రయాణంలో ఓ అడుగు వెనక్కి వేద్దాం అనుకోలేదు. ఓవైపు ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తూనే.. మరోవైపు విమర్శల్ని ఎంతవరకు తీసుకోవాలో అంత వరకే తీసుకున్నారు. అనవసర విషయాలవైపు తమ దృష్టి మళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఎన్నో అడ్డంకులు ఎదుర్కుని.. కఠినమైన ప్రయాణం చేసి.. చివరికి గమ్యం చేరుకున్నారు.
మొత్తం మీద నాయకత్వానికి చాలా నిర్వచనాలున్నాయి. అందులోనూ ఉద్యమాల్లోంచి వచ్చే నాయకుల.. నాయకత్వాన్ని విశ్లేషించటం అంత తేలిక కానే కాదు. పైగా ఉద్యమ నేతల స్వభావం.. ఓ మాటతోనే.. లేదంటే ఓ ప్రాథమిక సూత్రంతోనో ముడిపడి ఉండదు. ఏ ఉద్యమంలోనైనా భిన్న మనస్తత్వాలు ఉన్నవారితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాదు భిన్న దృక్పథాలు, ఆలోచనలు ఉన్న వ్యక్తుల్ని కలిసికట్టుగా పనిచేయించటానికి మేధో చతురత అవసరమౌతుంది. అసలీ ప్రక్రియే మామూలు వ్యక్తులకు అర్థమయ్యే విషయం కాదు. నాయకుడు పరస్పర వైరుధ్యాల్ని లెవల్ చేసే క్రమంలో భిన్న వాదనలు ఎత్తుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అసలైన నాయకుడు ఎప్పుడూ తన లక్ష్యాన్ని వదిలిపెట్టరు. కాకపోతే తాత్కాలిక వెసులుబాటు కోసం కాస్త అటూఇటూ పోతున్నట్టుగా భ్రమ మాత్రమే కలిగిస్తారు. పైగా ప్రజల్ని సామూహికంగా కదిలించాల్సి వచ్చినప్పుుడు.. మొదట ఆ ప్రజల దారిలోకి వెళ్లినట్టే వెళ్లి.. ఆ తర్వాత ఆ దారి నుంచి వారిని మెల్లగా అసలు దారిలోకి తీసుకురావడమే నాయకత్వ లక్షణం. ఇలాంటి చాకచక్యం ఉంటేనే నేతలు రాణించగలుగుతారు. లేకపోతే మొదటే బలవంతం చేస్తే.. ఉద్యమం అంతకంతకూ బలపడకపోగా.. క్రమంగా పలుచబడే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ప్రమాదం రాకుండా సరైన నాయకులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు. అసలు అలాంటి సమయాల్లోనే నాయకత్వం మరింత పదునెక్కుతుంది.
అలాగే ప్రతి ఒక్కరూ సహజసిద్ధంగా నాయకులు కావాల్సిన అవసరం లేదు. కొందరు ప్రజాక్షేత్రంలో అనుకోకుండా నాయకులు కావచ్చు. కానీ అలాంటి వారిలోనూ కచ్చితంగా నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడే.. వారికి పేరొస్తుంది. లేకపోతే ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుందని చెప్పటానికి మన కళ్ల ముందే చాలా ఉదాహరణలున్నాయి. ఓ ఊరిలో పేరు తెచ్చుకోవటానికి పది మందికి తెలిస్తే సరిపోతుందేమో. కానీ ఓ ఉద్యమాన్ని నిర్మించి.. విజయవంతంగా నడిపించి.. అనుకున్న లక్ష్యం చేరటానికి.. లక్ష్యం చేరాక కూడా ప్రజల గుండెల్లో బలమైన ముద్ర వేయటానికి కచ్చితంగా ప్రత్యేక లక్షణాలు కావాలి. ఆ మాటకొస్తే అసలు మహాత్మాగాంధీని చూసి బ్రిటీషర్లు చాలా సందర్భాల్లో ఇతడేం నాయకుడు..? ఇదేం నాయకత్వం..? అని చాలాసార్లు అనుకున్నారు. గాంధీ పైకి చరఖా తిప్పినా.. వెనుక దేశప్రజల్లో స్వావలంబనను పెంపొందించే అద్భుత కార్యక్రమాన్ని చాలా తేలికగా సాధించగలిగారు. అందుకే నాయకుడెప్పుడూ సంక్లిష్టమైన పనుల్ని చాలా సులభంగా చేయగలగాలి. అందరికీ చెప్పే ముందు.. తాను మొదట చేసి చూపించాలి. నడిపించే వాడే నాయకుడనే మాట నిజమే అయినా.. ఉద్యమ నేతల్లో చాలా మంది అనుచరుల కంటే ముందు నడిచారనేది చారిత్రక సత్యం. ఇలా నాయకత్వ లక్షణాల్ని జాగ్రత్తగా ఔపోసన పట్టిన నేతలు మాత్రమే ఉద్యమాలు విజయవంతం చేసి.. తిరుగులేని నేతలుగా పెరు తెచ్చుకున్నారు.

