తమ డిమాండ్ల పరిష్కారం కోసం పంజాబ్-హర్యానా రైతులు (Farmers Protest) చలో ఢిల్లీకి (Delhi) పిలుపునిచ్చారు. దీంతో పెద్ద ఎత్తున దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరారు. మరోవైపు అన్నదాతలు హస్తినలోకి అడుగుపెట్టకుండా ఉండేందుకు సరిహద్దులో భారీ ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. రోడ్డుకి మధ్య ఇనుప కంచెలు, సిమెంట్ దిమ్మెలు, బారికేడ్లు అడ్డుగా వేశారు. మరికొన్ని సరిహద్దు ప్రాంతాల్లో అయితే ట్రాక్టర్లను ఆపేందుకు పోలీసులు రోడ్లపై పెద్ద మేకులు వేశారు. ఇంకోవైపు రైతుల నిరసన కారణంగా ఢిల్లీ-నోయిడా సరిహద్దులో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఆయా మార్గాల గుండా అన్నదాతలు ఢిల్లీలోకి ప్రవేశిస్తున్నారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున రైతులు తరలిరావడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక జైలుగా (Temporary Jail) బవానా స్టేడియాన్ని (Bawana Stadium) మార్చాలని ఢిల్లీ ప్రభుత్వానికి (Delhi) కేంద్రం ఆదేశించింది.
కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ మాట్లాడుతూ రైతులు బియాస్ నది దగ్గర ర్యాలీని ప్రారంభించి.. రాత్రి ఫతేఘర్ సాహిబ్ వద్ద బస చేస్తారని తెలిపారు. అక్కడి నుంచి మంగళవారం పాదయాత్రగా ఢిల్లీకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిపారు.
ఇక హర్యానా ప్రభుత్వం కూడా రెండు పెద్ద స్టేడియాలను తాత్కాలిక జైళ్లుగా మార్చినట్లు తెలుస్తోంది. సిర్సాలోని చౌదరి దల్బీర్ సింగ్ ఇండోర్ స్టేడియం మరియు దబ్వాలిలోని గురుగోవింద్ సింగ్ స్టేడియం నిర్బంధిత రైతుల కోసం తాత్కాలిక జైళ్లుగా మార్చబడ్డాయి. ఢిల్లీ పోలీసులు ఆదివారం ఉత్తరప్రదేశ్ సరిహద్దుల దగ్గర క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ సెక్షన్ విధించారు.
