NTV Telugu Site icon

Anti Paper Leak Law: పేపర్‌ లీక్‌కు పాల్పడితే 10 ఏళ్ల జైలు.. రూ.కోటి వరకూ ఫైన్

Centar

Centar

Anti Paper Leak Law: వరుస క్వశ్చన్ పేపర్‌ లీక్‌లతో తీవ్ర ఇబ్బంది పడుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 2024ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇది జూన్‌ 21వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసినా ఎన్నికల హడావుడి స్టార్ట్ కావడంతో అమలు తేదీని వెల్లడించలేదు.. గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను క్వశ్చన్ చేయగా.. న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోంది, త్వరలో నోటిఫై చేస్తామన్నారు.

Read Also: India Playing XI: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. దూబే, జడేజాపై వేటు! హైదరాబాద్ ప్లేయర్ ఎంట్రీ

ఇక, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే కేంద్ర సిబ్బంది, వ్యవహారాలశాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను కొనుగోలు చేసినా, ప్రశ్నలు, జవాబులను లీక్‌ చేసినా, పరీక్ష రాసే వారికి సాయం చేసినా, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్‌ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా లెక్కిస్తారు. ఇందుకు కారణమైన వారు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్షతో పాటు కోటి రూపాయల వరకు జరిమానా విధించడానికి అవకాశం ఉంది. ఇందులో భాగస్వాములు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు నిరూపితమైతే వారి ఆస్తులనూ జప్తు చేయనున్నారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునూ వసూలు చేయనున్నారు. ఇక, నుంచి పేపర్‌ లీకేజీ కేసులను ఈ చట్టం కింద నమోదు చేస్తారు.