DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..

Biharmoney

Biharmoney

కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1, 2026 నుంచి వ్యవసాయం, నిర్మాణం, నిర్వహణ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు కరవు భత్యం (డీఏ) పెంపుతో భారీ శుభవార్త అందించింది. పండుగ సీజన్‌కు ముందు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వివిధ వర్గాల కార్మికుల రోజువారీ కనీస వేతనం పెరిగింది. ఈ పెంపు కార్మికుల నైపుణ్యం, వారు పనిచేస్తున్న ప్రాంతాలైన ఏరియా A, B, C ఆధారంగా భిన్నంగా వర్తిస్తుంది.

వ్యవసాయ రంగంలో ఏరియా A లోని అన్‌స్కిల్డ్ కార్మికులకు రోజువారీ వేతనం కనీసం రూ.537గా నిర్ణయించబడింది. ఇందులో రూ.333 మూలవేతనం, రూ.204 డీఏ భాగం ఉన్నాయి. ఇదే రంగంలో అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులకు రోజుకు రూ.705 లభిస్తుంది. ఇక ఏరియా B లో కార్మికులకు రూ.491, ఏరియా C లో రూ.486 చొప్పున రోజువారీ వేతనం అందనుంది.

రోడ్లు, భవనాలు, రన్‌వేలు, విద్యుత్, కేబుల్స్, నీటి పైప్‌లైన్లు వంటి నిర్మాణ, నిర్వహణ పనుల్లో పనిచేసే కార్మికులకు కూడా వేతనాలు భారీగా పెరిగాయి. ఏరియా A లో నిర్మాణ కార్మికులకు రోజుకు రూ.840, అత్యంత నైపుణ్యం ఉన్నవారికి రూ.1,111 చొప్పున చెల్లిస్తారు. అలాగే ఏరియా B లో ఈ వేతనాలు వరుసగా రూ.704, రూ.1,024 గా ఉండగా, ఏరియా C లో రూ.565, రూ.933 గా నిర్ణయించబడ్డాయి. సెమీ-స్కిల్డ్ , స్కిల్డ్ కార్మికుల వేతనాలు కూడా సవరించబడ్డాయి.

పెరుగుతున్న జీవన వ్యయాన్ని నియంత్రించడానికి, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రభుత్వం డీఏను సవరిస్తుంది. ఇండస్ట్రియల్ వర్కర్స్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI-IW) ఆధారంగా ఈ పెంపు చేపట్టింది. ఈ ఇండెక్స్ 424.80 నుంచి 431.42 పాయింట్లకు పెరగడంతో, 6.62 పాయింట్ల వృద్ధిని పరిగణలోకి తీసుకుని కొత్త డీఏను అమలులోకి తెచ్చారు. ఈ వేతన పెంపు ద్వారా కార్మికులకు ఆర్థికంగా ఎంతో ఊరట లభించనుంది.